ఈ.హెచ్.కార్ అనే చరిత్రకారుడు ‘‘గతానికి వర్తమానానికి జరిగే నిరంతర యుద్ధమే చరిత్ర’’అంటాడు. ఈ కోణం నుంచి చూసినప్పుడు చరిత్రలో కొత్త కోణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా భారత దేశ చరిత్రను ఇప్పటివరకు పలు రకాలుగా రచించే కృషి జరిగింది. మార్క్సిస్ట్ చరిత్రకారులు బిపిన్ చంద్రపాల్, రోమిలా థాపర్, డిడి కోశాంబి వంటి వారు శ్రామికవర్గ దృక్పథం నుంచి భారత దేశ చరిత్రను లిఖించారు.
ఇక సంప్రదాయ మత కోణం నుంచి చరిత్రను మూల్యాంకనం చేశారు. ఈ రెండు శిబిరాల నుండే కాకుండా బహుజన సబ్ఆల్ట్రన్ దృక్పథం నుంచి భారత దేశ చరిత్రను చూడాలి. ఆ పనిని పూలే – అంబేద్కర్లు ఏనాడో మొదలుపెట్టారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే ఒక విలువైన సూత్రీకరణ చేశారు. ‘‘ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులకు, ఈ దేశ మూలవాసులకు జరుగుతున్న నిరంతర యుద్ధమే భారత దేశ చరిత్ర’’అని తేల్చిపడేశాడు. ఈ ఒక్క మాటతో వేలయేండ్ల చరిత్రను అర్థం చేసుకోదగిన దిశానిర్దేశం చేశాడు ఫూలే.
చరిత్ర ఎప్పుడూ రచించే వారి కోణం నుండే ఉంటుంది. భారత దేశ చరిత్ర అంతా ఆధిపత్యకులాల చరిత్రగానే అప్పటి దాకా (పూలే–అంబేద్కర్ల దాకా) లిఖించబడింది. ఈ పద్ధతిని మార్చి ఇప్పుడు చరిత్రగర్భంలో కానరాకుండా పోయిన బహుజన మహనీయుల చరిత్రను వెలికి తీయాల్సిన చారిత్రక అవసరం మన ముందుకు వచ్చింది. గడిచిన అరశతాబ్ధంగా కొంతవరకు ఈ కృషి జరుగుతోంది. చరిత్రలో నిజమైన పోరాట యోధులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. పక్షపాతం ఆవహించింది. ఈ గోడలను బద్ధలుకొట్టాలి. చరిత్రను కొత్తగా నిర్మించాలి. అది మాత్రమే బహుజనుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పటిదాకా తమది కాని చరిత్రను బహుజనులు బలవంతంగా మోశారు. ఇప్పటికైనా తమ అసలు చరిత్రను వెలికి తీసుకోవాల్సిన సందర్భం ముందుకు వచ్చింది.
ఆ నేపథ్యంలో స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే బ్రిటిషువారిని గడగడలాడించిన ఒక మాంగ్ యోధుడు లహుజీ సాళ్వే. ఆయన ఒకవైపు బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాడుతూనే మరోవైపు ఆనాటి సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారు. విద్య ప్రాముఖ్యతను గుర్తించారు. ఈ దేశం బాగుండాలంటే బ్రిటిష్ వారి నుంచి విముక్తి లభించాలని ఆశించారు. ఆయన జీవితంపై వెలువడిన విలువైన పుస్తకం ఈ ‘‘క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె’’.
ఈ పుస్తకం పాఠకులకు చరిత్ర మరిచిపోయిన ఒక పోరాట యోధుణ్ని సజీవంగా పరిచయం చేస్తుంది. బడుగు బలహీన దగాపడిన ప్రజల్లో నిరాశ నిస్పృహలు శతాబ్దాలుగా ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలంటే వారికంటూ వారి ఘనమైన చరిత్రను తెలియజేయాలి. అప్పుడు మాత్రమే వారిలో ఒక ఆశాభావం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పొదువుకుంటాయి. తమలో ఉన్న బలం ఒక్కసారిగా మేల్కుంటుంది.
ఈ పుస్తకంలో లహుజీ జీవితాన్ని మరాఠ రచయిత చంద్రక్రాంత్ వాన్ఖేడే గొప్పగా అందించారు. దానిని గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ చక్కగా తెలుగులోకి అనువాదం చేశారు. దీనిని తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించి పాఠకులకు అందించింది.
14 నవంబర్,1794న మహారాష్ర్టలో జన్మించారు లహుజీ సాళ్వె. అతడిని కన్నతండ్రి ఒక పోరాట యోధుడు. పలు విద్యల్లో ఆరితేరినవాడు. మంచి వస్తాద్. అతడే రఘోజి సాళ్వె. ఇంటిలో నిత్యం రకరకాల యుద్ధవిద్యల్లో శిక్షణా కార్యక్రమాలు జరుగుతుండేవి. అందువల్ల లహుజీ బాల్యంలోనే అనేక విద్యలు తన తండ్రి వద్దనే నేర్చుకున్నాడు.
లహుజీ తండ్రి రఘోజీ ఎంతటి పరాక్రమ వీరుడంటే ఆయన వేటకు వెళ్లి ఒక పులిపై పోరాడి దానిని లొంగదీసుకొని భుజాల మీదేసుకొని తీసుకొస్తాడు. ఇది చూసి ఆ పురజనులు, రాజు సైతం ఆశ్చర్యపడతాడు. పులిని చంపడం అంటే మాటలు కాదు. అలాంటి రఘోజీ ఏకంగా దానిని బంధించి ప్రాణాలతో పట్టుకురావడం అందరని ఆశ్చర్యానికి గురిచేసింది. అలాంటి యుద్ధవిద్యలన్నీ లహుజీకి కూడా సహజంగానే అందివచ్చాయి.
లహుజీ, రఘోజీ మాత్రమే కాదు వారి వంశంలోని వారంతా ఇలాంటి వీరులే. ఆ వంశంలో నుంచి వచ్చిన వారు తమ యుద్ధకళల్ని తమ కోసం కాకుండా తమ చుట్టూ ఉన్న సమాజం కోసమే వినియోగించారు. రఘోజీ ప్రతిభకు ముగ్ధుడైన రాజు ఆయనకు సర్దార్ బాధ్యతలు అప్పగించాడు. అలా రఘోజీ రాజ్య రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలో బ్రిటిష్ వారు దండెత్తి వచ్చి రఘోజీని కొడుకు సాళ్వె కళ్ల ముందే హత్య చేశారు.
అది చూసి చలించిపోయిన లహుజీ తన తండ్రిని చంపిన వారిని ఈ దేశం నుంచి తరిమివేసే దాకా పెండ్లి చేసుకోనని ప్రతిజ్ఞ పూనుతాడు. అట్లా జీవితకాలం పెండ్లి చేసుకోకుండా బ్రిటిష్ వారిని ఓడించడానికి ఎంతోమంది వీరులను తన శిక్షణలోనే తయారు చేస్తాడు. తన దగ్గర తర్ఫీదు పొందినవారు బ్రిటిష్ వారి చేతిలో మరణిస్తున్నా ధైర్యాన్ని వీడకుండా, కృంగిపోకుండా ఎదురునిలిచిన ధీశాలి లహుజీ.
మరోవైపు ఆ కాలంలో మహాత్మ జ్యోతిరావుపూలే దంపతులు విద్య ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అంటరాని వెలివాడల్లో బాలికలకు పాఠశాలలు పెట్టారు. అది తెలిసి చాంధసులైన పండితులు పూలేను అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో పూలేకు అండగా నిలిచి రక్షణనిచ్చింది లహుజీనే. లహుజీ ధైర్యంతోనే పూలే మరింతగా విద్య ఉద్యమాన్ని విస్తరించాడు.
బాలికలను పూలే బడికి పంపించడానికి సంకోచించారు తల్లిదండ్రులు. ఆడపిల్లకు చదువెందుకు అనుకున్నారు. ఆ సమయంలో లహుజీ తన సోదరుని కూతురైన ముక్తా సాళ్వెను చదువుకొమ్మని ప్రోత్సహించాడు లహుజీ. అట్లా పూలే స్థాపించిన బడిలో చదువుకున్న ముక్తా సాళ్వె మొదటి వ్యాసకర్తగా చరిత్రకు ఎక్కింది. ఆ తరువాత మహిళా ఉపాధ్యాయురాలిగా మారింది. అలా ఆడపిల్లల చదువులకు కూడా లహుజీ అందించిన తోడ్పాటు చారిత్రాత్మకమైంది.
ఇలా లహుజీ సాళ్వె ఒక అట్టడుగు కులంలో పుట్టి అనేకమంది వీరులతో కలిసి పని చేశారు. ఒకవైపు బ్రిటిష్ వారితో నిరంతరం పోరాడాడు. ఎంతోమందిని తన వ్యాయామశాల నుండే తయారు చేశాడు. అలాంటి వీరుని చరిత్రను ఇవాళ్టి తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ముఖ్యంగా దేశభక్తిని గురించి, దేశభక్తుల గురించి విపరీతంగా చర్చ జరుగుతున్న కాలమిది. చరిత్ర వక్రీకరణలు విరివిగా విజృంభిస్తున్న కాలం కూడా ఇదే. ఇలాంటి కాలంలో మట్టిలో మాణిక్యం వంటి ఒక పోరాట యోధుడి చరిత్రను వెలుగులోకి తీసుకురావడం నిజంగా అభినందనీయం. ఈ పుస్తకాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలి.
ముఖ్యంగా సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అంబేద్కరిస్ట్ ఉద్యమానికి అవసరమైన పుస్తకం ఇది. బహుజన మహనీయుల జాబితాలో మనకు తెలియని యోధుడు లహుజీ సాళ్వె. ఆయన చేసిన విలువైన కృషికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కాల్సే ఉంది. ఆ లోటును కొంత తీర్చడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
-–డా. పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడమి, యువ పురస్కార గ్రహీత–
