
బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బీఅర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు రాష్ట్రంలో అవినీతి అక్రమాలు భారీగా జరిగాయని ఆరోపించారు. కరీంనగర్ ప్రతిమ మల్టిఫ్లెక్స్ లో దొరికిన రూ. 6 కోట్ల 67 లక్షల డబ్బు ఎవరివని ప్రశ్నించారు. కేసీఅర్ అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ దే ప్రతిమ హోటల్ అని చెప్పారు. ఆర్టీసీ స్థలంను లీజుకు తీసుకుని ప్రతిమ మల్టిఫ్లెక్సీ కట్టారని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే విచ్చల విడిగా డబ్బుల పంపిణీ చేసేందుకు బీఅర్ఎస్ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బులతో మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం కేసీఅర్ కుటుంబంకి కామధేనుగా మారిందన్నారు. కవిత అరెస్ట్ ఓ డ్రామా అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల కోసమే బీజెపీ, బీఅర్ఎస్ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ, బీఅర్ఎస్ ఒక్కటే అని ప్రజలు అనుకుంటున్నారని బీజెపీ నేతలే గతంలో ఎన్నో సార్లు చెప్పారన్నారు. బీజెపీ, బీఅర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మరని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు.