ఐపీఎల్ 2020లో ఆడనున్న అతి పెద్ద వయస్కుడు

ఐపీఎల్ 2020లో ఆడనున్న అతి పెద్ద వయస్కుడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి గురువారం వేలం నిర్వహించారు. అందులో రూ. 15.50 కోట్లకు ఆసీస్ పేసర్ కమిన్స్ ఎక్కువ ధరకు అమ్ముడయ్యాడు. కమిన్స్‌ని కొల్‌కత్తా దక్కించుకుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ ఆక్షన్స్‌లోకెల్లా కమిన్స్ ఎక్కువ ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు.

అయితే ఈ ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షలకు అమ్ముడైన లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తంబే కూడా తన పేరిట ఒక రికార్డు రాసుకున్నాడు. అదేంటంటే.. ఐపీఎల్ 2020లో ఆడుతున్న అతి పెద్ద వయస్కుడిగా తంబే రికార్డు సృష్టించాడు. ఇంతకీ ప్రవీణ్ ఏజ్ ఎంత అంటారా.. ఇప్పుడు ప్రవీణ్ వయసు 48 ఏళ్లు. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ లెగ్ స్పిన్నర్ 2013లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగాడు. ఇంతకుముందు ఐపీఎల్‌లో ఎక్కువ వయసున్న ఆటగాడిగా ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హాగ్, 44 సంవత్సరాల వయసులో కేకేఆర్ తరపున ఆడాడు. ఈ ఐపీఎల్‌లో తంబే కేకేఆర్ తరపున ఒక్క మ్యాచ్ ఆడినా.. ఎక్కువ వయసులో ఐపీఎల్ ఆడిన ఆటగాడిగా రికార్డును సొంతం చేసుకుంటాడు.

కాగా.. ప్రవీణ్ తంబే ఐపీఎల్ 2020 వేలంలో ఎంపిక కావడం పట్ల స్పందించిన ట్విట్టర్ యూజర్లు.. అతని కథ ఒక స్ఫూర్తిదాయకమైనదని, అతన్ని చూసి చాలా నేర్చుకోవచ్చని అంటున్నారు.

‘48 ఏళ్ల PravinTambe ఈ సీజన్‌ ఐపిఎల్ వేలంలో బిడ్లను ఆకర్షించడం నాకు పెద్ద పాఠం. ఇది నాకు చాలా విలువైన గుణపాఠాన్ని నేర్పుతుంది. కష్టపడి పనిచేయండి మరియు దాన్ని ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే అవకాశం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు!’ అని ఒక వ్యక్తి ట్వీట్ చేశారు.

‘ప్రవీణ్ తంబే 48 సంవత్సరాల వయసులో వచ్చే ఏడాది ఐపిఎల్‌లో ఆడనున్నాడు! ఇది చాలా మందికి ప్రేరణాత్మకం’ అని మరొకరు ట్వీట్ చేశారు.

‘ఐపీఎల్‌లో ప్రవీణ్ తంబే ఆట కోసం ఎదురుచూస్తున్నాను. అతను 48 సంవత్సరాల వయస్సులో ఐపీఎల్ ఆడటం అసాధారణం. కాబట్టి ఇది చాలా మందికి స్ఫూర్తిదాయకం. మీకు నైపుణ్యాలు ఉంటే వయసు అసలు సమస్యే కాదు’ అని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.

For More News..

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి