ముస్లింలకు పెద్ద పండుగ లాంటిది రంజాన్. నెల రోజుల పాటు పవిత్ర రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి చంద్రుడిని చూసిన తర్వాత ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది ఏప్రిల్ 23న రంజాన్ నెల ప్రారంభమవుతోంది. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచమంతా విలయతాండవం చేస్తోంది. దీంతో రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సౌదీ అరేబియాలోని గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ అల్ షేక్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఆర్గనైజేషన్లు, మత పెద్దలు సూచిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరాయి. కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని ఆయా సంస్థల తరఫున మత పెద్దలు సూచించారు.
మసీదుల్లో ఇఫ్తార్లు పెట్టుకోవద్దు..
రంజాన్ మాసంలో రోజా ఉండి క్రమం తప్పకుండా నమాజ్ చేయాలి. కానీ ఎవరూ ఒకే చోట గుమ్మిగూడొద్దు. రోజూ ఐదు వేళలా ఇంట్లోనే ఉండి అల్లాను ప్రార్థించండి. లాక్ డౌన్ నిబంధనలను, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని చెప్పారు లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా ఫిరంగి మహల్ చైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్. సూర్యోదయానికి ముందు చేసే భోజనం (సుహార్), సాయంత్రం రోజా ముగించాక ఇఫ్తార్ లను ఇంటి దగ్గర చేయాలని సూచించారు. అలాగే రోజా ముగించాక చేసే ప్రార్థనల కోసం కూడా ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. ఇస్లామ్ లో రంజాన్ ఉపవాసం తప్పనిసరి అని, పరిస్థితిని బట్టి మార్పులు చేసుకుని పాటించాలని చెప్పారు మౌలానా రషీద్. అయితే ఇఫ్తార్ విందులు మసీదుల్లో పెట్టుకోవద్దని, వీటి కోసంగా అక్కడకు గుంపులుగా రావొద్దని సూచించారు. మసీదులోనే నివాసం ఉంటున్న వారికి మాత్రమే ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రంజాన్ మాసంలో పెదల ఆకలి తీర్చండి
పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులను పేద కూలీల అకలి తీర్చాలని వాడాలని సూచించారు రషీద్. లాక్ డౌన్ ఉన్న కారణంగా బంధువులు, స్నేహితులను పిలిచి ఇఫ్తార్లు ఇవ్వడం కుదరని, జనం ఒక చోట చేరడం మంచిది కాదని చెప్పారు. అయితే మామూలుగా ఇఫ్తార్లకు చేసే ఖర్చుతో పేదలకు ఆహారం అందించాలన్నారు. ఈ రంజాన్ మాసంలో ఎవరూ ఆకలితో లేకుండా చూడాలని పిలుపునిచ్చారు. అయితే అలా సాయం చేసే సమయంలోనూ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. జామైత్ ఉలేమా ఏ హింద్ జనరల్ సెక్రెటరీ మహమూద్ మదానీ, యూపీలోని దారుల్ ఉలూమ్ దియోబంద్ వీసీ అబ్దుల్ ఖాసిం నొమాని కూడా ఇదే సూచన చేశారు. ఇఫ్తార్ల ద్వారా పేదల ఆకలి తీర్చాలన్నారు.
రంజాన్ మాజంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు సౌదీ అరేబియాలోని గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ అల్ షేక్. కరోనా మహమ్మారి పూర్తిగా కంట్రోల్ లోకి రాకుంటే రంజాన్ మాసం తొలి రోజైన రమదాన్, ఆఖరి రోజైన ఈద్ అల్ ఫితర్ పండుగ రోజుల్లోనూ ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేయాలని సూచించారు.
