
హైదరాబాద్: ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా ప్రజలు శాంతి యుతంగా ఉండాలని ఎంపీ అసదుద్దీన్ పిలుపునిచ్చారు. ఈ మేరకుహైదరాబాద్ నగర వాసులకు ఎంపి అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ వాసులు ప్రశాంత వాతావరణంలో ఫ్రైడే ప్రేయర్స్ లో పాల్గొనాలన్నారు. నేడు శుక్రవారం మక్కా మసీదు లో ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి ద్వేషపూరితమైన చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా శుక్రవారం జుమ్మ ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు జరుపుకోవాలని ఎంపీ అసదుద్దీన్ తెలిపారు.
పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరగనుండటంతో మక్కా మసీదు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు పెట్టారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, CRPF, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, బెటాలియన పోలీసులు ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రార్థనలు జరిగే అన్ని ప్రాంతాల్లో బందోబస్తు కంటిన్యూ అవుతుంది. మరోవైపు బేగంబజార్ లో వ్యాపారులు రాజాసింగ్ కు అనుకూలంగా ధర్నాలు చేసే అవకాశం ఉండటంతో అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పాతబస్తీలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. శాంతిభద్రతలకు అందరూ సహకరించాలని కోరుతున్నారు పోలీస్ అధికారులు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.