ఇకపై బడుల్లో ఆటలు, మీటింగ్​లు బంద్!

ఇకపై బడుల్లో ఆటలు, మీటింగ్​లు బంద్!

హైదరాబాద్, వెలుగుప్రతి స్కూల్ స్టార్ట్ అయ్యేది ప్రేయర్ తోనే. సాయంత్రమైతే.. పిల్లలంతా కలిసి ఆడుకునేవాళ్లు. కానీ.. ఇకపై స్కూళ్లలో పొద్దున ప్రేయర్.. సాయంత్రం ఆటలూ బంద్ కావచ్చు. ప్రేయర్ తప్పనిసరి అనుకున్నా.. చాలా స్కూళ్లలో ఎవరి క్లాస్ లో వారు ప్రేయర్ చేసుకోవాల్సిన పరిస్థితి రానుంది. కరోనా ఎఫెక్టే దీనంతటికీ కారణం. కరోనా కారణంగా ఇప్పటికే 2019–20 విద్యా సంవత్సరం అస్తవ్యస్తం అయిపోయింది. వచ్చే అకడమిక్​ఇయర్​పైనా దీని ప్రభావం తీవ్రంగానే పడనుంది. రాష్ర్టవ్యాప్తంగా మార్చి16 నుంచి విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. 9వ తరగతి వరకూ పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయగా, టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్12న స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. అయితే స్కూళ్లను ఎప్పుడు ప్రారంభించినా, అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే అకడమిక్ క్యాలెండర్లో 220 రోజులను ఎలా భర్తీ చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రెండో శనివారం, ఆదివారాలూ నడిపించాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క కరోనా వ్యాప్తి నివారణకు ఫిజికల్ డిస్టెన్స్​చాలా కీలకం. స్కూళ్లు స్టార్ట్ అయితే చిన్నపిల్లలను ఎలా అదుపు చేయాలనే దానిపై ఆఫీసర్లు, టీచర్లలో ఆలోచనలు మొదలయ్యాయి.

టీచర్లకు ట్రైనింగ్ ఆన్​లైన్​లోనే 

టీచింగ్​లో మెళకువలను నేర్పేందుకు టీచర్లందరినీ ఒకేచోటకు తీసుకొచ్చి, శిక్షణ ఇచ్చే కార్యక్రమాలన్నీ బంద్​ కానున్నాయి. భవిష్యత్​లో జరిగే శిక్షణ అంతా దాదాపు ఆన్​లైన్​లోనే నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రతి తరగతిలో కొంత సిలబస్​ఆన్​లైన్​లో బోధించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే టీ శాట్, ఇతర మాధ్యమాల ద్వారా ఆన్​లైన్ క్లాసులు ప్రారంభించారు. ఇదే విధానాన్ని ఇకముందూ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు.

శానిటైజర్, మాస్కులియ్యాలె

చాలా స్కూళ్లలో విద్యార్థులకు సరిపోయేంత గ్రౌండ్స్​ లేవు. దీంతో కొత్త అకడమిక్ ఇయర్​లో అందరూ కలిసి ప్రేయర్​చేసే పరిస్థితులు ఉండకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు స్కూళ్లలో అందరూ కలిసి ఆడే ఆటలు కూడా సాధ్యమైనంత వరకూ తగ్గే అవకాశముంది. ఇప్పటివరకూ ఒక్కో బెంచీపై ముగ్గురు, నలుగురు స్టూడెంట్స్​కూర్చునేటోళ్లు. కానీ భవిష్యత్​లో ఒక్కో బెంచీపై ఒక్కరు లేదా ఇద్దర్ని మాత్రమే కూర్చోబెట్టే ఆలోచనలు చేస్తున్నారు. దీనికితోడు ఎక్కువ మంది విద్యార్థులుంటే, షిఫ్ట్​ల వారీగా స్కూల్​నిర్వహించాలని భావిస్తున్నారు. స్కూల్​ప్రారంభం రోజే శానిటైజర్, రెండు జతల మాస్కులు ఇవ్వాలనే డిమాండ్స్​కూడా వస్తున్నాయి. స్కూళ్లలో సామూహికంగా జరిగే మీటింగ్ లు, ఇతర కార్యక్రమాలన్నీ బంద్​ అయ్యే అవకాశాలున్నాయి.