హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో కొత్తగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) సెక్షన్ల నిర్వహణపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్ల పనివేళలను ఖరారు చేస్తూ అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేసింది.
స్టేట్లో ఎంపిక చేసిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు కొనసాగనున్నాయి. చిన్నారుల వయస్సును దృష్టిలో ఉంచుకుని సాధారణ స్కూల్ టైమింగ్ కంటే తక్కువ గంటలపాటే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.
జంట నగరాల్లో మార్నింగ్ 8:45 నుంచే..
ప్రీ-ప్రైమరీ సెక్షన్ల సమయాలను ప్రాంతాల వారీగా విభజించారు. జిల్లాల్లోని స్కూళ్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 గంటలకే తరగతులు మొదలై, మధ్యాహ్నం 12 గంటలకు ముగియనున్నాయి.
మరోపక్క వచ్చే ఏడాది వేసవికాలంలో నిర్వహించే హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్ కూడా విద్యాశాఖ ఇప్పుడే ప్రకటించింది. 2027 మార్చి15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి.
వెనకబడిన విద్యార్థులకు రెమెడియల్ క్లాసెస్
వెనకబడిన విద్యార్థుల చదువులపైనా సర్కారు ఫోకస్ పెట్టింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో వెనకబడిన వారి కోసం సెప్టెంబర్ ఆఖరు వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రత్యేక తరగతులు (రెమెడియల్ క్లాసులు) నిర్వహించనున్నారు. రోజూ ఒక సబ్జెక్టు చొప్పున వీటిని బోధిస్తారు. అలాగే, విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం ప్రతిరోజూ స్పోర్ట్స్/గేమ్స్ పీరియడ్ తప్పనిసరి చేస్తూ క్యాలెండర్‌లో మార్పులు చేశారు.
మరోపక్క టీచర్లకు నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లోనూ మార్పులు జరిగాయి. గతంలో ప్రతిఏడాది ఏడు సమావేశాలు ఉండగా, వచ్చే ఏడాది నుంచి వాటిని ఆరుకు తగ్గించారు. జనవరి నెలలో పండగ సెలవులు పోగా కేవలం 20 పనిదినాలే ఉండటంతో, ఆ నెలలో సమావేశాన్ని రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది.
