గ్రాండ్‌‌గా గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌

గ్రాండ్‌‌గా  గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌

మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో  ఎస్.రాధాకృష్ణ (చిన బాబు) నిర్మించిన చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరులో గ్రాండ్‌‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు. మహేష్ బాబు మాట్లాడుతూ ‘మన ఊరులో ఈ ఫంక్షన్ జరగడం ఆనందంగా ఉంది.

త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. ఆయనతో సినిమా చేసినప్పుడల్లా.. నా పెర్ఫార్మెన్స్‌‌లో నాకు తెలియకుండానే  ఒక మ్యాజిక్ జరుగుద్ది. అతడు, ఖలేజా చిత్రాల్లో అలాగే జరిగింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’లో కూడా కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దీనికి త్రివిక్రమ్ గారే  కారణం. నిర్మాత చినబాబు గారికి మోస్ట్ ఫేవరేట్ హీరో నేనే కావడం హ్యాపీ. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా.

తెలుగమ్మాయి శ్రీలీలతో యాక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే... ఆమెతో డ్యాన్స్ చేయడం మరో ఎత్తు. గెస్ట్ రోల్ చేసిన మీనాక్షికి థ్యాంక్స్.  తమన్ ఇచ్చిన కుర్చీ మడతపెట్టి సాంగ్‌‌కి థియేటర్లు బద్దలైపోతాయి. సంక్రాంతి నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ సీజన్‌‌లో నా సినిమా రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం. మా నాన్నగారు లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఇకపై నాకు అమ్మ, నాన్న, అన్నీ అభిమానులే’ అని అన్నారు.  శ్రీలీల మాట్లాడుతూ ‘మహేష్ గారు, త్రివిక్రమ్‌‌ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్.

నాకిది రీ లాంచ్‌‌లా అనిపిస్తోంది. అమ్ము పాత్రలో నాటుగా కనిపిస్తా’ అని చెప్పింది.  మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘మహేష్‌‌ గారితో నటించే  అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్. ఈ ప్రాజెక్టుతో చాలా విషయాలు నేర్చుకున్నా. త్రివిక్రమ్ గారిని గురూజీ ఎందుకంటారో అర్ధమైంది’ అని చెప్పింది. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ఒక సినిమాకి వంద శాతం పని చేయాలంటే.. రెండొందల శాతం పనిచేసే హీరో మహేష్ బాబు. ఆయనతో  అతడు, ఖలేజా చిత్రాలు చేసినప్పుడు ఎలా ఉన్నారో..  ఇప్పుడు అలాగే ఉన్నారు.

రమణ గాడిగా మహేష్ అందర్నీ అలరిస్తారు. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా, ఆనందంగా జరుపుకుందాం’ అని అన్నారు. కార్యక్రమానికి హాజరైన  దిల్ రాజు సంక్రాంతి వైబ్స్ ముందే కనిపిస్తున్నాయి అన్నారు.  నిర్మాత చినబాబు, నటుడు అజయ్ ఘోష్,  లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు.