
- 37 ఏండ్ల పాటు వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం
- ఇటీవల రాజీనామా చేసిన మనోజ్ సోని స్థానంలో నియామకం
- వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు పదవిలో కొనసాగనున్న సుదాన్
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ 29 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. ఆగస్టు 1వ తేదీన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రీతి సుదాన్ 1983 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె భర్త కూడా ఐఏఎస్ ఆఫీసరే. వీరిద్దరు ఏపీ కేడర్ ఐఏఎస్‌లు. ఉమ్మడి ఏపీలోని వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా పని చేశారు.
ప్రీతి సుదాన్ 37 ఏండ్ల పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించారు. కేంద్ర హెల్త్ సెక్రటరీగా కరోనా టైమ్ లో యాక్టివ్ రోల్ పోషించారు. బేటీ బచావో, ఆయుష్మాన్ భారత్ స్కీంల రూపకల్పనలో, ఈ - సిగరెట్లపై నిషేధం, జాతీయ వైద్య కమిషన్‌పై చట్టం వంటి అంశాల్లోనూ కీలకంగా పని చేశారు. కాగా, ఇటీవలి వరకు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోని వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేయడంతో కొత్త చైర్మన్ నియామకం అనివార్యం అయింది.