
ఇబ్రహీంపట్నం, వెలుగు: వైద్యం వికటించి ఏడు నెలల గర్భిణి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లికి చెందిన 7 నెలల గర్భిణి పంతంగి మానస (22) రెగ్యులర్‌గా సుల్తాన్‌బజార్ మెటర్నిటీ హాస్పిటల్‌కు చెకప్‌కు వెళ్తోంది. ఐరన్ తక్కువగా ఉందని ఇంజెక్షన్ తీసుకోవాలని ప్రిస్క్రిప్షన్‌లో అక్కడి డాక్టర్ సూచించడంతో.. శుక్రవారం మంచాల పీహెచ్‌సీకి వెళ్లింది. అక్కడ ఇంజెక్షన్ తీసుకున్న 10 నిమిషాల్లోనే మానస కుప్పకూలింది.
దీంతో బాధితురాలిని కుటుంబసభ్యులు ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మానస మృతికి కారణమని మంచాల పీహెచ్సీ ముందు బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. భర్త పంతంగి ఆనంద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.