నడిరోడ్డు పై మహిళ ప్రసవం: సర్కారు దవాఖానాలో వసతుల లేమి

నడిరోడ్డు పై మహిళ ప్రసవం: సర్కారు దవాఖానాలో వసతుల లేమి

గర్భిణి.. ఓవైపు పురిటి నొప్పులు..సర్కారు ఆస్పత్రికి చేరినా.. వివిధ వైద్యపరీక్షల కోసం వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువై నడిరోడ్డు పైనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గర్భిణుల కోసం ఎన్నో చేస్తున్నామని చెబుతున్న పాలకులు.. సర్కారీ దవాఖానాల్లో వసతులుకల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వెలుగు: నిండు గర్భిణి రోడ్డుపైనే ప్రసవించిన ఘటన ఎల్బీనగర్ లో జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో తల్లీకొడుకులను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.సూర్యపేట జిల్లా ముటంపల్లి గ్రామానికి చెందినరాం బాబు, మేరమ్మ దంపతులు కూలీ పనిచేస్తుంటారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మూడునెలల క్రితం నుంచి వీరు అబ్దుల్లాపూర్ మెట్ కుషిఫ్ట్ అయ్యారు. మేరమ్మ గర్భవతి కావడంతో అబ్దుల్లాపూర్ మెట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆమెకు 9 నెలలు నిండటంతో అక్కడి డాక్టర్లు సూచనతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి డాక్టర్లను సంప్రదించారు. పరీక్షల కోసం బయటకెళ్లొస్తూ ..ఆమెకు పలు పరీక్షలు చేయాలని, ఇందుకోసం బయట ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఆశ్రయించాలని సూచించారు. భర్త రాంబాబు తనస్నేహితుల వద్ద అప్పు చేసి శుక్రవారం పలు పరీక్షలు చేయించాడు. ఇంకా కొన్ని రక్త పరీక్షలు చేయించాలని డాక్టర్లు మళ్లీ సూచించడంతో శనివారం భార్యను తీసుకుని గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షలు పూర్తయ్యాక మధ్యాహ్నం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ లో బస్సు దిగగానే మేరమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి. భర్త ఆటోకోసం వెళ్లొచ్చేసరికే మేరమ్మ రోడ్డుపైనే ప్రసవించింది. స్థానికుల సమాచారంతో108 సిబ్బంది వచ్చి తల్లీకొడుకులను వనస్థలిపురం ఏరియాఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారిద్దరూక్షేమంగా ఉన్నారు. రోడ్డుపై స్పందించిన స్థానికులకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపాడు.