
- బులంద్‌షహర్‌లో ఘటన
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
బులంద్‌షహర్: గంజాయి మత్తులో ఒక యువకుడు గుడిలోని ఇద్దరు పూజార్లను చంపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. బులంద్‌షహర్ జిల్లా పగోడ్ గ్రామంలోని గుడిలో సాధు జగందాస్ (55), సేవదాస్ (35) అనే వ్యక్తులు కొద్ది కాలంగా పూజార్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు చాలా రోజులుగా గుడిలోనే నివాసం ఉంటున్నారు. ఆ ఊరికి చెందిన మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తి రెండు రోజుల క్రితం గంజాయి తాగి ఆలయంలోకి వచ్చి పూజార్లతో గొడవకు దిగాడు. పూజార్లు దొంగతనం చేశారని వాళ్లపై ఆరోపణలు చేశాడు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి మళ్లీ గంజాయి తాగి పెద్ద కత్తి తీసుకుని గుడిలోకి వెళ్లి పూజార్లను పొడిచి చంపినట్లు గ్రామస్థులు చెప్పారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. పూజార్ల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. గ్రామ శివార్లలో పడి ఉన్న నిందితుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. నిందితుడు బాగా మత్తులో ఉన్నాడని, మత్తు దిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని అన్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ రిపోర్ట్ అందించాలని పోలీసులను ఆదేశించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించి నివేదిక అందిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.