- మహిళతో సహా ఇద్దరు డాక్టర్లు, సహకరించిన ఐదుగురు అరెస్ట్
కామారెడ్డి, వెలుగు: నెలలు నిండకుండానే గర్భిణికి డెలివరీ చేసిన డాక్టర్లు, బిడ్డను అమ్మేసిన వ్యక్తులు, గర్భిణితో కలిపి మొత్తం ఎనిమిది మందిని కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఓ యువతికి రామారెడ్డి మండలం పోశానిపేట గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెండ్లి జరిగింది.
కొన్ని రోజుల తర్వాత యువతికి హెల్త్ ప్రాబ్లమ్ రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో టెస్ట్ చేయించగా ఎనిమిది నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో పెండ్లి అయిన రెండు నెలలకే ఎనిమిది నెల గర్భం ఎలా వస్తుందంటూ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత గర్భాన్ని తొలగించుకొని తిరిగి అత్తారింటికి వెళ్లాలని భావించిన యువతి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమన్విత హాస్పిటల్‌కు వెళ్లింది.
హాస్పిటల్ నిర్వాహకులైన తండ్రీకొడుకులు ఆర్‌ఎంపీ ఇట్టం నడిపి సిద్ధిరాములు, గాంధారి మండల మెడికల్ ఆఫీసర్ ఇట్టం ప్రవీణ్‌కుమార్‌ను కలిసి డెలివరీ చేయాలని కోరింది. డెలివరీతో పాటు బిడ్డను కూడా లేకుండా చేస్తామని ఇందుకు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో యువతి తల్లిదండ్రులు రూ. 1.30 లక్షలు చెల్లించారు. ఏప్రిల్ 11న అర్ధరాత్రి యువతికి ఇంజక్షన్ ఇవ్వడంతో నార్మల్ డెలివరీ అయి ఆడబిడ్డ పుట్టింది. బిడ్డను అమ్ముతామని హాస్పిటల్ నిర్వాహకులు రాజంపేటకు చెందిన ఇట్టం బాలకిషన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన సిరిసిల్లకు చెందిన తన బంధువు దేవయ్యకు చెప్పాడు.
పెండ్లి అయి పిల్లలు లేని ఇల్లంతకుంటకు చెందిన భూపతిని సంప్రదించగా ఆయన చిన్నారిని కొనుగోలు చేసేందుకు అంగీకరించాడు. దీంతో రూ. 20 వేలకు చిన్నారిని అమ్మేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి భర్త చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చాడు. వారు వివరాలు సేకరించి, చిన్నారిని ఐసీడీఎస్ ఆఫీసర్లకు అప్పగించారు. అనంతరం కామారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి యువతితో పాటు హాస్పిటల్ నిర్వాహకులు నడిపి సిద్దిరాములు, ప్రవీణ్‌కుమార్, హాస్పిటల్ మేనేజర్ ఉదయ్‌కిరణ్, వాచ్‌మెన్ బాలరాజు, మధ్యవర్తులుగా వ్యవహరించిన బాలకిషన్, దేవయ్య, చిన్నారిని కొనుగోలు చేసిన భూపతిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
