
- బీజేపీ నేతల మధ్య గ్యాప్ లేదు
- అధికార పార్టీ ప్రోత్సాహంతో అసత్య ప్రచారం చేస్తున్నరు : ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదని, గ్యాప్ పెరిగిందని కొన్ని మీడియా చానెళ్లలో వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ‘ఈ కథనాలు పూర్తిగా వాస్తవ విరుద్ధం, దురుద్దేశపూరితం, బీజేపీని దెబ్బతీయడానికి అధికార పార్టీ ప్రోత్సాహంతో ఇలాంటి కథనాలను వండి వడ్డిస్తున్నట్టు భావించాల్సి వస్తుంది’ అని గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఇది జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని, మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. చెన్నమనేని వికాస్ జాయినింగ్ పోగ్రాంలో కొంత మంది నేతలు పాల్గొనలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా మీడియా నిజానిజాలను తెలుసుకొని టెలికాస్ట్ చేయాలని ఆయన సూచించారు.