కార్లు, ఫ్రిజ్‌‌‌‌లు, వాషింగ్‌‌మెషిన్లు మస్తు సేల్

కార్లు, ఫ్రిజ్‌‌‌‌లు, వాషింగ్‌‌మెషిన్లు మస్తు సేల్
  • కార్లు, ఫ్రిజ్‌‌‌‌లు, వాషింగ్‌‌మెషిన్లు, ఫోన్ల వరకు అన్ని 
  • సెగ్మెంట్లలోనూ పెరిగిన ప్రీమియం ప్రొడక్ట్‌‌ల సేల్స్‌‌
  • రికార్డ్ లెవెల్ అమ్మకాలు జరిపిన బెంజ్‌, లంబోగిని
  • మస్తుగా సేల్ అయిన  రూ. 70 వేల పైన ఫోన్లు.. 


బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: కార్లు, టీవీలు, వాషింగ్‌‌మెషిన్లు, ఫోన్లు  వంటి వివిధ సెగ్మెంట్లలోని ప్రీమియం (ధరలు ఎక్కువగా ఉన్న)  ప్రొడక్ట్‌‌ల సేల్స్ ఈ ఏడాది బాగా పెరిగాయి. లంబోగిని, మెర్సిడెస్‌‌–బెంజ్, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ  కార్ల తయారీ కంపెనీల సేల్స్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఊపందుకోవడమే దీనికి రుజువు.  కేవలం కార్లే కాదు ఏసీలు, ఫ్రీజ్‌‌లు వంటి హోమ్‌‌ అప్లయెన్స్‌‌లలోనూ,  స్మార్ట్‌‌ ఫోన్‌‌ వంటి ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్‌‌లోనూ ప్రీమియం ప్రొడక్ట్‌‌లకు డిమాండ్ పెరుగుతోందని   కన్జూమర్ ఇంటెలిజెన్స్ కంపెనీ జీఎఫ్‌‌కే ఇండియా ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో  మిడ్‌‌ సెగ్మెంట్‌‌, మాస్‌‌ (తక్కువ రేటు)  సెగ్మెంట్‌‌లలో సేల్స్ తగ్గినప్పటికీ, ప్రీమియం సెగ్మెంట్‌‌లోని ప్రొడక్ట్‌‌ల సేల్స్ మాత్రం పెరిగాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో లగ్జరీ కార్ల అమ్మకాలు 55 శాతం పెరిగాయి.  సూపర్ లగ్జరీ కార్ల (ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న)  సేల్స్‌‌ కూడా కరోనా ముందు స్థాయిలను క్రాస్ చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జీఎఫ్‌‌కే విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి– మే మధ్య 55 ఇంచుల కంటే పైన ఉన్న టీవీల సేల్స్‌‌ 66 శాతం పెరిగాయి. అదేవిధంగా 350 లీటర్ల కంటే  ఎక్కువ వాల్యూమ్‌‌ ఉన్న రిఫ్రిజరేటర్ల సేల్స్ 44 శాతం , కెపాసిటీ 8 కేజీల కంటే ఎక్కువ ఉన్న వాషింగ్‌‌ మెషిన్ల సేల్స్ 29 శాతం ఎగిశాయి. గేమింగ్ ల్యాప్‌‌టాప్‌‌ల అమ్మకాలయితే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 107 శాతం పెరిగాయని జీఎఫ్‌‌కే ఇండియా డేటా వెల్లడించింది. కాగా, దేశంలో లగ్జరీ ప్రొడక్ట్‌‌లను కొనేవారి సైజు చిన్నగా ఉంది. దీనికి తోడు కిందటేడాది తక్కువ సేల్స్ నమోదు కావడంతో లో–బేస్ కారణంగా ఈ ఏడాది లగ్జరీ ప్రొడక్ట్‌‌ల అమ్మకాలు ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, దేశంలో ప్రీమియం ప్రొడక్ట్‌‌ల మార్కెట్‌‌ మరింత పెరుగుతుందని లగ్జరీ ప్రొడక్ట్‌‌ల తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. 

రానున్న నెలల్లో మరింతగా..

‘ఈ ఏడాది ఇండియా మరింత ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనావేస్తున్నాం. ఈ ఏడాది లగ్జరీ వెహికల్స్ తయారీ కంపెనీల సేల్స్‌‌ గతంలో నమోదు చేసిన గరిష్ట లెవెల్స్‌‌కు చేరువవుతాయి. మొత్తం వెహికల్‌‌ సేల్స్‌‌లో ప్యాసెంజర్ కార్ల సెగ్మెంట్‌‌ వాటా కొద్దిగా ఎక్కువ ఉంటుంది’ అని ఆడి ఇండియా హెడ్‌‌ బల్బిర్‌‌‌‌ సింగ్‌‌ ధిల్లన్‌‌ అన్నారు. ప్రీమియం ప్రొడక్ట్‌‌ల సేల్స్ చిన్న సిటీలలో కూడా పెరుగుతున్నాయని జీఎఫ్‌‌కే ఎండీ నిఖిల్‌‌ మాథుర్  పేర్కొన్నారు. వివిధ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే స్మార్ట్ ప్రొడక్ట్‌‌లకు డిమాండ్ పెరుగుతోందని, ఈ డిమాండ్‌‌ వలనే  ప్రీమియం ప్రొడక్ట్‌‌ల గ్రోత్‌‌ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రికార్డ్ లెవెల్‌‌లో (7,573 యూనిట్లు) అమ్మకాలు జరిపిన మెర్సెడెస్‌‌- బెంజ్‌‌, జులై–-సెప్టెంబర్ మధ్య మరో 6 వేల యూనిట్లను డెలివరీ చేయడానికి ఆర్డర్లను దక్కించుకుంది. ఇటాలియన్ లగ్జరీ కార్ల కంపెనీ లంబోగిని కూడా ఈ ఏడాది ఇండియా మార్కెట్‌‌ కోసం కేటాయించిన కార్లను ఇప్పటికే అమ్మేసింది. ‘ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు క్రియేట్ అవుతున్న దేశాల్లో ఇండియా రెండో ప్లేస్‌‌లో ఉంది.  గతంలో మూడు లేదా నాల్గో జనరేషన్ బిజినెస్‌‌ మ్యాన్‌‌లకు తమ కార్లను అమ్మేవాళ్లం. తాజాగా మొదటి జనరేషన్‌‌ బిజినెస్‌‌మ్యాన్‌‌లు, ఎంటర్‌‌‌‌ప్రెనూర్లు, మహిళలు తమ బయ్యర్లుగా ఉన్నారు. దేశంలో తమ కస్టమర్ల బేస్‌‌ విస్తరించింది’  అని లంబోగిని ఇండియా హెడ్‌‌ శరద్‌‌  అగర్వాల్ పేర్కొన్నారు.    లగ్జరీ  బైక్‌‌లను తయారు చేసే బీఎండబ్ల్యూ మోటరాడ్‌‌ కూడా ఇండియా మార్కెట్‌‌లో విస్తరిస్తోంది.  కొత్త కొత్త మోడల్స్‌‌ను అందుబాటులోకి తెస్తోంది. కంపెనీ సేల్స్ 2021 తో పాటు, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పెరిగాయి.  హోమ్‌‌ అప్లయెన్స్‌‌లను తయారు చేసే బోష్‌‌ సీమన్‌‌ సేల్స్ కూడా ఈ ఏడాది జనవరి-–మే మధ్య ఏడాది ప్రాతిపదికన  70 శాతం వృద్ధి సాధించాయి.

ఊపందుకున్న ప్రీమియం ఫోన్ల సేల్స్‌‌‌‌

ఈ ఏడాది జనవరి–మే మధ్య దేశంలోకి వచ్చిన యాపిల్ షిప్‌‌మెంట్లు 23 శాతం పెరిగాయని స్మార్ట్‌‌ఫోన్‌‌ షిప్‌‌మెంట్ల డేటాను విశ్లేషించే కౌంటర్‌‌‌‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ధర రూ. 70 వేల కంటే ఎక్కువ ఉండి, తాజాగా మార్కెట్‌‌లోకి వచ్చిన మోడల్స్‌‌కు డిమాండ్ ఎక్కువయ్యిందని, అందుకే యాపిల్ షిప్‌‌మెంట్లు పెరిగాయని వివరించింది. స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌‌లో ధర రూ. 30 వేల కంటే ఎక్కువ ఉన్న సెగ్మెంట్‌‌ 1.5 రెట్లు వృద్ధి సాధించిందని కౌంటర్‌‌‌‌పాయింట్ వివరించింది. యాపిల్‌‌, శామ్‌‌సంగ్‌‌, వన్‌‌ప్లస్‌‌, షావోమి, వివో వంటి కంపెనీలు లేటెస్ట్ మోడల్స్‌‌ను తెస్తుండడంతో పాటు, ఫైనాన్సింగ్ ఆఫర్లు కూడా కస్టమర్లను ఆకర్షిస్తుండడంతో ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్‌‌ల సేల్స్ ఊపందుకున్నాయని పేర్కొంది.  కానీ,  కరోనా ప్రభావం పడని కన్జూమర్లే ప్రీమియం ప్రొడక్ట్‌‌ల సేల్స్ గ్రోత్‌‌కు కారణమవుతున్నారు. దేశంలో మెజార్టీ ప్రజల ఇన్‌‌కమ్‌‌ లెవెల్స్ తగ్గిపోయాయి. లివింగ్ కాస్ట్ ఎక్కువయ్యింది. దీంతో సాధారణ కన్జూమర్లు తమ ఖర్చులను తగ్గించేసుకుంటున్న విషయం తెలిసిందే.