
మెదక్, వెలుగు: వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి అంచనాకు అనుగుణంగా అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైస్ మిల్లర్లను సిద్ధం చేస్తున్నారు.
ఈ సీజన్ లో జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 3,01,455 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ముందుగా నాట్లు వేసిన పొలాలు అక్టోబర్ మొదటి వారంలో కోతకు వచ్చేలా ఉన్నాయి. జిల్లాలో సాగైన పంట ద్వారా సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
అందులో నుంచి రైతుల అవసరాలు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోను 4.23 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), మహిళా స్వయం సహాయ సంఘాలు (ఐకేపీ), వ్యవసాయ మార్కెట్ కమిటీలు (ఏఎంసీ), రైతు ఉత్పత్తి దారుల సంఘాల(ఎఫ్పీఓ) ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 503 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అక్టోబర్ ఒకటి నుంచి
జిల్లాలో అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలో సివిల్ సప్లై, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), కో ఆపరేటివ్, అగ్రికల్చర్, మార్కెటింగ్, వెయిట్స్ అండ్ మెజర్ మెంట్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ఆఫీసర్లతో పాటు, జిల్లాలోని రైస్ మిల్లర్లు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో అడిషనల్ కలెక్టర్ నగేశ్ సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
పక్కా ప్రణాళిక
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నాం. 4 లక్షల 23 వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశాం. అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.
రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతికి అవసరమైన 10 శాతం బ్యాంక్గ్యారంటీని, అగ్రిమెంట్లను వెంటనే సమర్పించాలని సూచించాం. కేంద్రాల నుంచి మిల్లుకు లారీల్లో వచ్చే ధాన్యం వెంటవెంటనే దిగుమతి చేసుకునేందుకు తగినంత మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పాం. - మెంచు నగేశ్, అడిషనల్ కలెక్టర్