మాఘస్నానాలకు ముస్తాబైన ఏడుపాయల

మాఘస్నానాలకు ముస్తాబైన ఏడుపాయల

పాపన్నపేట, వెలుగు: మెదక్​జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గ భవానీ మాత సన్నిధి మాఘస్నానాలకు ముస్తాబైంది. మంజీరా పాయల మధ్యలో భవానీ మాత స్వయంభుగా వెలియడం వల్ల ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని  భక్తుల నమ్మకం. దాదాపు లక్షమంది పుణ్య స్నానాల కోసం వస్తారని పాలకవర్గం అంచనా వేస్తుంది. ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో మోహన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. 

ఆలయ పరిసరాలు, చెక్​డ్యాం ప్రాంతాల్లో  భక్తులు స్నానాలు చేయడానికి షవర్లతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి టెంపరరీ గదులను సిద్దం చేశారు. ఆలయం ముందు భక్తుల కోసం వీఐపీ క్యూ లైన్ తో పాటు సాధారణ  క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. భక్తుల స్నానాల కోసం ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్​ ఏఈ విజయ్​తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ నరేశ్​ పేర్కొన్నారు.