
హైదరాబాద్, వెలుగు : సొంత జాగాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించే స్కీమ్ పై గైడ్ లైన్స్ రెడీ చేయాలని హౌసింగ్ అధికారులను ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్ లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై మంత్రి 2 గంటల పాటు రివ్యూ చేపట్టారు. రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ ఇండ్లు పూర్తి కావడానికి ఎన్ని నిధులు కావాలన్న అంశంపై పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయ్యాయి? ఎన్ని పూర్తయ్యాయి? ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉన్న ఖాళీ భూములు, సొంత బిల్డింగులు, లీజుకు ఇచ్చినవి, ఖాళీగా ఉన్నవి, సక్రమంగా లీజు అమౌంట్ కడుతున్నారా? లేదా? రాజీవ్ స్వగృహ, హౌసింగ్ కార్పొరేషన్ ల వివరాలనూ మంత్రి తెలుసుకున్నారు. త్వరలో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ ఉంటుందని, అప్పటి కల్లా అన్ని రిపోర్టులు రెడీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.