చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ సిద్ధం చేస్తున్నాం

చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ సిద్ధం చేస్తున్నాం

గాంధీ ఆస్పత్రిలో  పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆస్పత్రి లో సౌకర్యాలు పరిశీలించిన ఆయన.. ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. పది సార్లు గాంధీ ఆస్పత్రిలో పర్యటించానని తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా సిద్ధం చేసుకున్నామన్నారు. పీఎం కేర్ కింద దేశంలో 1222 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ 8 యూనిట్లు పనిచేస్తున్నాయని..మరో 6 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ లో 41 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రానికి 1,68,61,809 డోసుల వ్యాక్సిన్ పంపామని.. ఇంకా 13 లక్షల 18 వేల డోసులు నిల్వ ఉన్నాయన్నారు. చివరి వ్యక్తి వరకు వ్యాక్సిన్  ఉచితంగా అందిస్తామన్నారు కిషన్ రెడ్డి. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ అక్టోబర్ వరకు కొనసాగుతుందన్నారు.అవసరమైతే మరిన్ని నెలలు కొనసాగిస్తామన్నారు.చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ సిద్ధం చేస్తున్నామని..విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవన్నారు. వ్యాక్సినేషన్ మహా యజ్ఞంలా సాగుతోందని తెలిపారు.

జన ఆశీర్వాద యాత్ర లో వ్యాక్సిన్ గురించి చెప్పడంతో పాటు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించానని అన్నారు కిషన్ రెడ్డి. పొలిటికల్ మీటింగ్ ల్లో ప్రతి ఒక్కరు మాస్క్  పెట్టుకోవాలన్నారు. తన తలకు తగిలిన గాయానికి గాంధీలోనే చికిత్స తీసుకుంటాని తెలిపారు కిషన్ రెడ్డి.