తెలంగాణ జాబ్​ స్పెషల్​

తెలంగాణ జాబ్​ స్పెషల్​

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న మొదటి గ్రూప్​–1 ఇది. కాబట్టి పాత ప్రశ్నపత్రాలు లేవు. అభ్యర్థులు 2008 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో జరిగిన గ్రూప్​–1 ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకోవాలి. అంతేకాకుండా  2017 నుంచి 2022 వరకు జరిగిన యూపీఎస్సీ క్వశ్చన్​ పేపర్స్​ నమూనాగా తీసుకోవచ్చు. ఎందుకంటే 2019 పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ గోవా తీర్మానం ప్రకారం రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్లు తమ సిలబస్​లో కనీసం 70శాతం యూపీఎస్సీ సిలబస్​కు అనుగుణంగా రూపొందించుకోవాలి. ప్రశ్నలకు కనీసం 50శాతం యూపీఎస్సీ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని ఇవ్వొచ్చు. వీటితోపాటు ప్రతిరోజు వార్తా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్​ ఆధారంగా రైటింగ్​ ప్రాక్టీస్​ చేయవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌–1 తొలి దశ ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసింది. ప్రశ్న పత్రం క్లిష్టంగా ఉండడంతో  ప్రిలిమ్స్​లో ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​కు అర్హత సాధిస్తామనే  సందేహం అభ్యర్థులను వెంటాడుతోంది. టీఎస్‌పీఎస్సీ మాత్రం ఎలాంటి కటాఫ్‌ మార్కులు ఉండవని జోన్ల ప్రాతిపదికగా1:50 నిష్పత్తిలో మెయిన్స్​కు అర్హులను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్​కు అర్హత లభిస్తుంది.. మెయిన్స్‌ పరీక్ష విధానం తెలుసుకుందాం.. 

ప్రిలిమ్స్​ రాసిన వాళ్లలో కొంత మంది ఎస్​ఐ, కానిస్టేబుల్​ పరీక్ష ఆబ్జెక్టివ్​ తరహాలో ప్రిపేరైన వాళ్లు ఉన్నారు. వీరికి మెంటల్​ ఎబిలిటీ, జనరల్​ సైన్స్​, పాలిటీ, తెలంగాణ కరెంట్​ అఫైర్స్​ తదితర విషయాల మీద విపరీతమైన పట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ల స్కోర్లు 80 పైన ఉండవచ్చు. కానీ వీళ్ల టా​ర్గెట్​  పోలీస్ జాబ్​ మాత్రమే. వీళ్లు గ్రూప్​–1 మెయిన్స్​కు కారు. 

100కు 70శాతం మంది అభ్యర్థులు డెడికేటెడ్​గా గ్రూప్​–1 ప్రిపేరవుతున్న అభ్యర్థుల స్కోర్లు 60 పైన ఉండవచ్చు. కాబట్టి ప్రిలిమ్స్​ స్కోర్లు చూసుకున్న అభ్యర్థులు ఈ ఫిగర్స్​లో ఉంటే మీ మెయిన్స్​ ప్రిపరేషన్​ మొదలు పెట్టవచ్చు. ఫలితాల కోసం వెయిట్​ చేయాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్​ రిజల్ట్స్​ రావడానికి ఎంత లేదన్నా మరో 10 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్స్​కు సిద్ధమవ్వాలి.

రైటింగ్​ ప్రాక్టీస్​ ముఖ్యం: గ్రూప్‌–1 మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌  పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో 900 మార్కులకు ఆరు పేపర్లతో నిర్వహించనున్నారు. దీంతోపాటు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కేవలం అర్హత పేపర్‌గా నిర్దేశించారు.  ప్రతి పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ లేకపోవడంతో ఫైనల్​ ఫలితాలు మెయిన్స్​లో వచ్చే మార్కుల మీదే  ఆధారపడి ఉన్నాయి. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ప్రధాన పరీక్ష 2023, ఫిబ్రవరిలో  నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులకు నవంబర్​, డిసెంబర్​, జనవరి అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు నెలలు ఏం చేస్తావు అనే దాన్ని బట్టి 30 ఏళ్ల భవిష్యత్​ ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైటింగ్​ ప్రాక్టీస్​ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. రోజుకు సగటున చదివే సమయంలో 10శాతం సమయాన్ని ఆన్సర్​ రైటింగ్​కు కేటాయించాలి. ఈ సమయాన్ని నెలవారీగా పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు  నవంబర్​లో రోజుకు 10 గంటలు చదివితే దానిలో కనీసం ఒక గంట సమయం ఐదు ప్రశ్నలకు ఆన్సర్​ రైటింగ్​ కోసం కేటాయించాలి.  డిసెంబర్​లో రోజూ 12 గంటలు చదివితే కనీసం 2 గంటలు 10 ప్రశ్నలకు ఆన్సర్​ రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. జనవరిలో రోజుకు 15 గంటలు చదివితే కనీసం 3 గంటలు 15 ప్రశ్నలకు రైటింగ్​ ప్రాక్టీస్​ ఉండాలి. అంటే... నవంబర్​లో రోజుకు ఐదు చొప్పున 150, డిసెంబర్ లో రోజుకు 10 చొప్పున 300, జనవరిలో రోజుకు 15 చొప్పున 450‌‌ ప్రశ్నలకు ఆన్సర్ రైటింగ్​ ప్రాక్టీస్​ చేస్తే మొత్తం 9000 ప్రశ్నలు ప్రాక్టీస్​ అవుతాయి.
ఫోకస్​ చేయాల్సిన అంశాలు: మెయిన్స్​ సిలబస్​కు సంబంధించిన సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. ఒక మౌలిక అంశాన్ని ప్రాథమికంగా చదువుతూ సమకాలీన అంశానికి ప్రాధాన్యతనివ్వాలి. ఉదాహరణకు పాలిటీలో సమాఖ్య అంశాలు మౌలికంగా చదువుతూ గవర్నర్​ వివాదాస్పద పాత్రను సమకాలీన అంశాలతో జోడించి చదవాలి. అంటే కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో గవర్నర్​ పదవి ఎలా వివాదం అయిందో ఉదాహరణలతో తెలుసుకోవాలి.  జనరల్​ ఎస్సేలో మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ చారిత్రక వారసత్వం, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, న్యాయ వ్యవస్థలో క్రియాశీలత, పోలీస్​ సంస్కరణలు, నూతన విద్యావిధానం, సివిల్​ సర్వీసుల్లో కర్మయోగి తదితర సంస్కరణలు, రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం, ప్రపంచ చమురు– ఆర్థిక సంక్షోభం మొదలైన అంశాలు చూడాలి.

మెయిన్స్​ ప్లాన్​:  మెయిన్స్కు​ హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమాలు అధ్యయనం చేయాలి. జనరల్‌ ఎస్సే పేపర్‌లో, హిస్టరీ పేపర్‌లో ఉండే తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, హక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.  

ఇంగ్లిష్​ పేపర్:  తెలుగు మీడియం అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే పేపర్​ జనరల్​ ఇంగ్లిష్. ఇది క్వాలిఫైయింగ్​ పేపర్​ అయినా కొంత ప్రత్యేక ప్రిపరేషన్​ అవసరం. రోజూ చదివే షెడ్యూల్​లో ఒక గంట కేటాయించి ప్రాక్టీస్​ చేయాలి. యూపీఎస్సీ గత ప్రశ్నపత్రాల ఆధారంగాను ఇతర రాష్ట్రాల పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ల గత ప్రశ్నపత్రాల ఆధారంగా చేయాలి. 

కోర్టు కేసులు: గ్రూప్​-1, 2 తదితర పరీక్షలంటేనే కోర్టు కేసులు అన్నట్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థులు గమనించాల్సిందేంటంటే ఏపీలో 2020లో జరిగిన గ్రూప్​-1 పరీక్ష మీద కూడా అనేక కేసులున్నాయి. అయినా భర్తీ, నియామకాలు పూర్తయి అభ్యర్థులు ఉద్యోగంలో చేరి రెండు నెలల జీతం కూడా తీసుకున్నారు. దేని దారి దానిదే. కేసులు ఒక వైపు నడుస్తుంటాయి. మరోవైపు భర్తీ అయిపోతుంది. 2019 గోవా తీర్మానంలో ఇదీ ఒక అంశం. యూపీఎస్సీ ఒక వైపు కోర్టు కేసులున్నా మరోవైపు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఇదే ఫార్ములాను రాష్ట్రాలు కూడా పాటించాలని ఈ తీర్మానంలో నిర్ణయించారు. కాబట్టి సీరియస్​ అభ్యర్థులు కోర్టు కేసుల గురించి పట్టించుకోకుండా చదవాలి.

పేపర్​1: జనరల్‌ ఎస్సే పేపర్‌గా పేర్కొనే ఇందులో కరెంట్​ అఫైర్స్,  సమస్యలు, ఆర్థిక వృద్ధి, భారత చారిత్రక, వారసత్వ సంపద, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ అంశాల్లోని ముఖ్యమైన  టాపిక్స్​ గుర్తించి వారంలో ఒకరోజు ఎస్సే రైటింగ్​కు కేటాయించాలి.

పేపర్‌–2:  ఇందులో  ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారతదేశ చరిత్ర, సంస్కృతి; అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం అంశాలను చదవాలి. వీటితోపాటు భారత, రాష్ట్ర భౌగోళిక అంశాలపైనా పట్టు సాధించాలి.

పేపర్‌–3: దీనిలో ముఖ్యంగా ఇండియన్​ పాలిటీ, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై ఫోకస్​ చేయాలి.

పేపర్​–4: ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్ట్‌గా పేర్కొనే పేపర్‌–4 కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, అభివృద్ధి, పర్యావరణ సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి.

పేపర్​–5: ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సామాజిక అభివృద్ధికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దోహద పడుతున్న తీరు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మ్యాథ్స్​కు సంబంధించిన డాటా ఇంటర్​ప్రిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్​ చేయాలి. 

పేపర్​–6: ఆరో పేపర్‌గా పేర్కొన్న తెలంగాణ ఉద్యమంలో  ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై పట్టు సాధించాలి.

పి. కృష్ణ ప్రదీప్​, 21st సెంచరీ ఐఎఎస్​ అకాడమీ