హాస్య బ్రహ్మకు ‘సూర్యకాంతం స్మారక పురస్కారం’.. వెండితెర గుండమ్మతో బ్రహ్మీ నటించిన సినిమాలివే

హాస్య బ్రహ్మకు ‘సూర్యకాంతం స్మారక పురస్కారం’.. వెండితెర గుండమ్మతో బ్రహ్మీ నటించిన సినిమాలివే

‘‘గుండమ్మ కథ సినిమా మళ్ళీ తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆవిడ పాత్ర పోషించేవారు లేక రీమేక్ చేయలేకపోయారు.. అది సూర్యకాంతమ్మ బ్రాండ్” అన్నారు బ్రహ్మానందం. మంగళవారం (2025 OCT 28) ప్రసాద్ ల్యాబ్స్‌‌లో జరిగిన సూర్యకాంతం శత జయంతి పురస్కారాల ముగింపు వేడుకలో ఆయన సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.

కిన్నెర ఆర్ట్స్‌‌ థియేటర్స్‌‌తో కలిసి డా.సూర్యకాంతం శతజయంతి కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘హై హై నాయక, పవిత్ర బంధం, బంధువులు వస్తున్నారు జాగర్త లాంటి చిత్రాల్లో సూర్యకాంతం గారితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆమె నటనలో అత్త, వ్యక్తిగా అమ్మ, అందుకే ఆమె అత్త కాదు అత్తమ్మ. అలాంటి ఓ గొప్ప నటి పేరిట ఇస్తున్న ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.

నటులు మురళీ మోహన్, రోజా రమణి, తనికెళ్ల భరణి, ఆలీ, దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొని సూర్యకాంతం నటనా చాతుర్యంతో పాటు ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  గుండమ్మ కథ లో గయ్యాళి సవితి తల్లిగా, అత్తగా సూర్యకాంతమ్మ అభినయం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అప్పట్లో ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా తయారుకాని రోజుల్లో వచ్చిన సూర్యకాంతం.. ఆ తర్వాత తనదైన ముద్రతో దాదాపు 750పైగా సినిమాల్లో నటించి శభాష్ అనిపించుకుంది. అలా తన కెరియర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయింది సూర్యకాంతం.

అసలు సినిమాల్లో తన పాత్రకు, బయట ఉండే విధానానికి చాలా తేడా ఉండేది. బయట ఆమె ఉండే తీరు ఎంతో సౌమ్యం. చక్కని మాటతీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేది. మనుషుల్ని స్థాయితో సంబంధం లేకుండా అభిమానించేవారు ఆమె. పండుగలు పబ్బాలు వస్తే వర్కర్స్ కు బోనస్ ఇచ్చే విశాల హృదయం సూర్యకాంతం సొంతం.

ఇకపోతే.. బ్రహ్మానందం హాస్యనటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడంతో పాటుగా 2009లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించబడ్డారు. ఆయన తన మొత్తం కెరియర్లో 1,050కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ, తనదైన హాస్యంతో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.