ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే..ఎవరి గ్రాఫెక్కడ?

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే..ఎవరి గ్రాఫెక్కడ?

అందరికంటే ముందున్నప్పటికీ.. టీఆర్ఎస్​ పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది. ఏడాది ముగిసేసరికి అధికార పార్టీ ఓటు బ్యాంకు డౌన్ ట్రెండ్​ కొనసాగుతోందని సర్వేలో వెల్లడైంది. అదే టైమ్​లో ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకుంటున్న తీరు కనిపించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏ పార్టీకి ఓటింగ్​ శాతం ఎంత ఉంటుంది? అధికార పార్టీ ఓటు బ్యాంకు తగ్గిందా.. పెరిగిందా?  ఓటు షేర్​లో ఇతర పార్టీల వాటా ఎంత? అనే అంశాలపై ప్రజలేమనుకుంటున్నారనేది ఆసక్తి రేపింది. సర్వేలో వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్​ఎస్​ ఓటు శాతం 39.5గా నమోదైంది. కాంగ్రెస్​ 26.2 శాతం,  బీజేపీ 25.6 శాతం,  ఎంఐఎం 2.4 శాతం, ఇతర పార్టీలు 1.6 శాతంగా నమోదైంది. ఏమీ చెప్పలేమన్న వాళ్లు 4.7శాతం మంది ఉన్నారు.

కారు​ డౌన్​ ట్రెండ్

నిరుడు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే టీఆర్​ఎస్​కు ఇప్పుడు ఏడు శాతంపైగా ఓటు బ్యాంక్​ తగ్గింది. ఫస్ట్ టర్మ్​లో ఐదేండ్లు నిండకముందే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్​ఎస్ 2018 ఎన్నికల్లో అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. 2014తో పోలిస్తే.. ఓట్లు, సీట్లలోనూ రికార్డు సృష్టించింది. కానీ ఆ జోరు కొనసాగించలేకపోతోందని ఇప్పుడున్న తీరు వేలెత్తిచూపుతోంది. నిరుడు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  46.9 శాతం ఓట్లు సాధించిన టీఆర్​ఎస్​.. నాలుగు నెలలకు జరిగిన లోక్​సభ ఎన్నికల్లో 41.29 శాతం ఓట్లకు పరిమితమైంది. అదేతీరుగా ఓటింగ్​ గ్రాఫ్​ డౌన్ ఫాల్​ అవుతోందని, ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఇంచుమించుగా రెండు శాతం ఓటు బ్యాంకును కోల్పోయిందని  తాజా సర్వే ప్రతిబింబించింది. ఆర్టీసీ సమ్మె, సంక్షేమ పథకాల అమలు తీరు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు జాప్యం కావటం, వెంటాడుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ టీఆర్​ఎస్  ప్రభుత్వం ఓటింగ్​పై ప్రభావం చూపిందనే  అభిప్రాయాలున్నాయి.

More Related News

సీఎం కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు !!

ట్రెండింగ్​లో  బీజేపీ

ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ గ్రాఫ్​ మెల్లగా పెరుగుతూ వస్తోంది. క్రమంగా రాష్ట్రంలో ఆ  పార్టీ ఓట్ల షేర్​ పుంజుకుంటోంది. నిరుడు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేవలం 7.1 శాతం ఓట్లున్న బీజేపీ, ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే ఏప్రిల్​లో జరిగిన లోక్​సభ ఎన్నికలప్పుడు అందరి అంచనాలను మించి 19.45 శాతం ఓట్లను సాధించింది. అప్పటితో పోలిస్తే సర్వే ప్రకారం ఇప్పుడు మరో ఆరు శాతం ఓటు వాటా పెరిగింది. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం, ప్రధాని మోడీ నిర్ణయాలు, పథకాలతో రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఎక్కడి కాంగ్రెస్​ అక్కడే

రాష్ట్రంలో కాంగ్రెస్  మరింత డీలా పడింది. నిరుడు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన ఆ పార్టీ.. లోక్​సభ ఎన్నికల్లో కాస్త పుంజుకుంది. క్రమంగా పార్టీ ఓట్ల వాటా తగ్గుతున్న తీరు కనిపిస్తోంది. నిరుడు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28.4 శాతం ఉన్న కాంగ్రెస్​ ఓట్​ షేర్, నాలుగు నెలలకు అంటే ఏప్రిల్​లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో 29.48 శాతానికి చేరుకుంది. ఇప్పుడు దాని ఓటు షేర్​ 26.2 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. సంప్రదాయక ఓటర్లు తప్ప కొత్త ఓటు బ్యాంకును ఆకట్టుకోవటంలో కాంగ్రెస్​ విఫలమైందనే చెప్పుకోవాలి.

ప్రతిపక్షాల బలహీనతే సర్కార్​  బలం

వివిధ అంశాల వారీగా బేరీజు వేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత జనంలో అంతగా కనిపించలేదు. 45.1 శాతం మంది సానుకూలత వ్యక్తం చేయగా… కేవలం 23.8 శాతం మంది వ్యతిరేకతను ప్రదర్శించారు. 21 శాతం మంది తటస్థంగా ఉన్నారు. అప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత, సానుకూలతలపై నిర్ణయానికి రాలేమని కొందరు అభిప్రాయపడగా, కొందరు తమ సమాధానాన్ని చెప్పేందుకు ఇష్టపడలేదు. కొందరు తటస్థ వైఖరితో ఉన్నట్లు చెప్పారు.