తెలంగాణ సంస్కృతిని కాపాడ్తం : సీఎం రేవంత్

తెలంగాణ సంస్కృతిని కాపాడ్తం : సీఎం రేవంత్
  •  వేల ఏండ్ల చరిత్ర మన సొంతం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌‌‌‌షాహీ సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయం వంటి  వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో చేపట్టిన  కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు.

 ఈ ప్రాజెక్టును 2013లో చేపట్టారని ఆయన తెలిపారు. 100కు పైగా స్మారక చిహ్నాల పరిరక్షణతో పాటు106 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆగాఖాన్ ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలంగాణ సొంతం. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు తదితరులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 

ఆ పాలకుల్లో ప్రతి ఒక్కరూ తమదైన సాంస్కృతిక ముద్ర వేశారు. శతాబ్దాలుగా హైదరాబాద్ ‘గంగా-జమునా తెహజీబ్’గా విలసిల్లుతున్నది” అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్​ఒవైసీ, మాజీ మేయర్​బొంతు రామ్మోహన్​తదితరులు పాల్గొన్నారు.