
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్స్ వివరాలను ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి ఎ.వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి మహేశ్వర రెడ్డి పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటులో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రం ఎమ్మెల్యేల ఓటుకు ఒక్కో విధమైన విలువ ఉంటుంది. ఓట్ల విలువను లెక్కించడానికి 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు.ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరు ఓటు విలువలు ఉంటాయి. ఈ ఓటు విలువ వివిధ రాష్ట్రాల్లో ఉండే జనాభా పై ఆధారపడి ఉంటుంది.
- ఎమ్మెల్యే ఓటు విలువ = రాష్ట్రం మొత్తం జనాభా/ ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య x 1/1000.
- ఎంపీ ఓటు విలువ = అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం విలువ(28 రాష్ట్రాలు+3 కేంద్ర పాలిత ప్రాంతాలు)/ ఎన్నికైన ఎంపీల సంఖ్య.
- ఉమ్మడి ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148.
- తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132.
- అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208.
- అతి తక్కువగా సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ 7.