యాదగిరిగుట్టకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదగిరిగుట్టకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో 4వ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ యాదగిరిగుట్టను సందర్శించారు. ఆలయంలో లక్ష్మీ నర్సింహ్మ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి ముర్ము బోల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్ లో యాదగిరి గుట్టకు వెళ్లారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు యాదాద్రి హెలిప్యాడ్ చేరుకున్నారు. 9 గంటల 50 నిమిషాలకు రాష్ట్రపతి ముర్ము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆలయానికి చేరుకున్నారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. 

ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ్టితో రాష్ట్రపతి శీతాకాల విడిది ముగియనుంది. గత మూడు రోజుల నుంచి ద్రౌపది ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు. బొల్లారంలోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులర్పించారు. డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. డిసెంబర్ 29న నారాయణమ్మ కాలేజ్ ను విజిట్ చేశారు. సాయంత్రం శంషాబాద్, ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. ఇవాళ యాదగిరిగుట్టు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన విందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.