ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నికలకు పిలుపునిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు

ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నికలకు పిలుపునిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు

టెహ్రాన్: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలని ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పిలుపునిచ్చారు. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి ప్రశ్నార్థకంగా కనిపిస్తోందని, దేశ భవిష్యత్తును నిర్ణయించేందుకు, ప్రజలకు స్పష్టత కోసం ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో గందరగోళం, అస్తవ్యస్త పరిస్థితులు ఎప్పటిలోగా చక్కబడతాయో అర్థం కావడం లేదని, అస్తవ్యస్థ పరిస్థితులు చక్కబడాలంటే ఎన్నికలే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. 
ఆప్ఘనిస్తాన్ ప్రజలకు తమ సొంత ప్రభుత్వాన్ని నిర్ణయించుకునే అవకాశం, హక్కు ఉండాలన్నారు. ప్రజల అభీష్టం మేరకు ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు కావాలని..  ఆప్ఘనిస్తాన్ లో ప్రజల శాంతి భద్రతలకు ఇరాన్ దేశం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికే ఇరాన్ దేశం మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత అందర్నీ క్షమించేశామని, ఎవరినీ శిక్షించబోమని చెప్పారని, మరీ ముఖ్యంగా మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగించమని చెప్పి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
ఆఫ్గన్ లో మహిళల స్వేచ్ఛను కాలరాస్తూ.. కో-ఎడ్యుకేషన్ ను రద్దు చేసి బాలికలకు పురుషులు చదువు చెప్పరాదంటూ కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు తరచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లిబన్ల కారణంగా ఎంతో మంది తమ ఉపాధి కోల్పోయి రోడ్డునపడి గత్యంతరంలేక ఎదురుతిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపధ్యంలో ఇరాన్ దేశాధ్యక్షుడి ప్రకటన.. ఆయన సూచనలు ఆఫ్ఘన్ పౌరులకు దిశానిర్దేశం జరుపుతుందన్న ఆశలు రేపుతోంది.