పక్షపాత రాజకీయాలకు అతీతంగా పార్టీలు పనిచేయాలి

పక్షపాత రాజకీయాలకు అతీతంగా పార్టీలు పనిచేయాలి

దేశ ప్రయోజనాల దృష్ట్యా పక్షపాత రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు పనిచేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి కోవింద్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కోవింద్ ప్రసంగిస్తూ.. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. పార్లమెంట్ చర్చల సమయంలో ఎంపీలు ఎల్లప్పుడూ గాంధీతత్వాన్ని అనుసరించాలని కోరారు. ప్రజల సంక్షేమానికి ఏది అవసరమో దానినే ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన  ప్రజలకు రుణపడి ఉంటానన్న కోవింద్.. తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైన  ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.

కాగా, ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం (జులై 25)న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన ముర్ము.. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఘనవిజయం సాధించారు. దీంతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించే తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఆమెనే కావడం విశేషం.