
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ముచ్చింతల్ లో రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆయన దర్శించుకోనున్నారు. గంటన్నర పాటు ముచ్చింతల్ లో ఉంటారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మూడున్నరకు అక్కడి నుంచి ముచ్చింతల్ లోని ఆశ్రమానికి వస్తారు. మూడున్నర నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు దివ్యదేశాలను సందర్శిస్తారు. తర్వాత.. 120 కిలోల బంగారంతో తయారుచేసిన రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆవిష్కరిస్తారు. 4 గంటల నుంచి 4 గంటల 20 నిమిషాల వరకు సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు. తర్వాత ఆడిటోరియాన్ని పరిశీలిస్తారు. అక్కడ ఆయన ప్రసంగిస్తారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. 7 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సాధారణ భక్తులను అనుమతించబోమని చెప్పారు. రాష్ట్రపతి పర్యటన ఉన్నందున మధ్యాహ్నం తర్వాత సాధారణ ప్రజలు ముచ్చింతల్ రావొద్దని సూచించారు. ఇక.. శంషాబాద్ నుంచి ముచ్చింతల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టు చెప్పారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.