పత్రికాస్వేచ్ఛను పరిరక్షించాలి.. ఇవాళ (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

పత్రికాస్వేచ్ఛను పరిరక్షించాలి.. ఇవాళ (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్ర తి ఏటా మే 3న పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తారు.  పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, ఆ స్వేచ్ఛమీద  అవగాహన కల్పించడం ఈ  దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం మే 3వ తేదీన  ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరపాలని 1993లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.  పత్రికా స్వేచ్ఛను  గౌరవించవలసిన  అవసరాన్ని  ప్రభుత్వాలు గుర్తించాయి.  

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను  అంచనావేయడం,  దాన్ని పరిరక్షించడం, విధి నిర్వహణలో  ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు  నివాళి అర్పించడం వంటివి  పత్రికా స్వేచ్ఛ దినోత్సవ లక్ష్యాలు.  జర్నలిజం  ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం.  ఒక  సంఘటన, కుంభకోణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి  ప్రజలకు  వెల్లడించే  ప్రయత్నంలో  ప్రాణాలను పణంగా పెట్టిన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు.  వారి కృషిని అభినందించే  ప్రయత్నమే ఈ దినోత్సవ కీలక ఉద్దేశంగా చెప్పవచ్చు.  ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే.. మీడియా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను ప్రోత్సహించడం,  
ప్రపంచవ్యాప్తంగా  మీడియా  స్వతంత్ర స్థితిని అంచనావేయడం,  జర్నలిస్టులు, మీడియా  నిపుణులను వారి వృత్తి నిర్వహణలో  ఎదురయ్యే దాడుల నుంచి రక్షించడం మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది.  

సెన్సార్షిప్,  బెదిరింపులు, వేధింపులు, జైలుశిక్ష,  హింసవంటి వాటిని  ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు  అండగా నిలిచి అవగాహన కల్పించడం మరో ముఖ్యవిధిగా నిర్ణయించారు. సత్యాన్వేషణలో  ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల జ్ఞాపకాలను మననం చేసుకుని  ప్రపంచ పత్రికా దినోత్సవం 
సందర్భంగా వారికి నివాళి అర్పిస్తారు. 

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో  పత్రికలు కీలక పాత్ర

ప్రపంచవ్యాప్తంగా  ప్రభుత్వాలు, ప్రజలు, పత్రికాస్వేచ్ఛ,  జర్నలిస్టుల  నిబద్ధతను  గౌరవించవలసిన  అవసరాన్ని యునెస్కో  నొక్కి చెబుతుంది.  గతంలో నిర్వహించిన దినోత్సవాల్లో వార్తా మాధ్యమాల ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే చర్యలపై  ప్రస్తావించారు.  ఇంటర్​నెట్  కంపెనీల  పారదర్శకతను  నిర్ధారించే యంత్రాంగాలపై  నిర్దిష్ట చర్చ చోటు చేసుకుంది.   సమాచార హక్కును సమర్థించడంలోనూ, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలోనూ స్వేచ్చాయుత,  స్వతంత్ర  పత్రికా యంత్రాంగం పోషించే కీలకపాత్రను ఈ స్వేచ్ఛా దినోత్సవం గుర్తు చేస్తుంది.  

భారతీయ దృక్కోణం నుంచి ఈ దినోత్సవం  రాజకీయ, కార్పొరేట్,  మతపరమైన  ఒత్తిళ్లతో సహా  దేశ మీడియా రంగంలో  కొనసాగుతున్న  సవాళ్లను  తెలియజేస్తుంది.  స్వేచ్ఛ,  వాక్ స్వాతంత్ర్యానికి  భారత దేశం బలమైన  రాజ్యాంగ రక్షణలు  కల్పించింది.  అయితే, దేశవ్యాప్తంగా  పెరుగుతున్న ఆందోళనల మధ్య  పత్రికా రంగం  ఒడుదుడుకులకు లోనవుతూనే ఉంది.  భారత స్వాతంత్య్ర ఉద్యమంలో  పత్రికలు కీలక పాత్ర పోషించాయి.  ప్రజల్లో  చైతన్యం పెంచడానికి ఇవి ప్రధానంగా వ్యవహరించాయి.  భారత రాజ్యాంగంలో ఎన్నోరకాల అధికారాలు ఉన్నాయి.  

కానీ, పత్రికా స్వేచ్ఛ అంశం గురించి ప్రత్యేకంగా  ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.  19 A ( 1 )  అధికరణ ప్రకారం  పౌరులకు  కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం పత్రికలు పనిచేస్తున్నాయి.  ప్రస్తుతం పత్రికారంగంలో  పెనుమార్పులు వచ్చాయి.  పత్రికలు  కొత్తరూపు రేఖలను  సంతరించుకున్నాయి.  సమాచారాన్ని  ప్రజలకు నాణ్యంగా చేరవేయడానికి పత్రికలు ప్రాధాన్యతను ఇస్తాయి.  ఎలెక్ట్రానిక్ మీడియా ఉనికిలోకి రాకముందు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఐక్యరాజ్య సమితి  ప్రకటించిన ఈ దినోత్సవం ఇప్పటికీ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగానే పరిగణనలో ఉండిపోయింది.  ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా నిష్పాక్షిక జర్నలిజం  ప్రజాస్వామ్యానికి పునాది.  పత్రికా స్వేచ్ఛకు ఈ దినోత్సవం అంకితం.

- జి.యోగేశ్వర రావు,
సీనియర్ జర్నలిస్ట్