బీజేపీలో బీసీ వాదం.. ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటున్న నేతలు

బీజేపీలో బీసీ వాదం.. ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీజేపీలో బీసీ వాదం పెరుగుతున్నది. ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని హైకమాండ్​పై ఒత్తిడి తీసుకువచ్చేలా పార్టీలోని బీసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది. అధికార బీఆర్ఎస్.. బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు బీసీల్లోని చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఇలా రెండు ప్రధాన పార్టీలు పోటీపడి బీసీ కార్డును ప్రయోగిస్తుండడంతో.. బీజేపీ కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీలోని బీసీ నేతలు ఢిల్లీ పెద్దలను కోరాలని యోచిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ను కలిసి తమ అభిప్రాయాలను చెప్తున్నారు. బీజేపీలో ఉన్న బీసీ కులాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు రాష్ట్ర స్థాయి సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను బీసీలకే కేటాయించాలని హైకమాండ్​కు విన్నవించే ప్రయత్నంలో ఉన్నారు.

రాష్ట్రానికి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీజేపీ పరిస్థితిని అంచనా వేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఆ పార్టీకి చెందిన 119 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రానికి రానున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, యూపీకి చెందిన ఈ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం రాగానే సికింద్రాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో వర్క్ షాపు నిర్వహిస్తారు. దీనికి చీఫ్ గెస్టుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండే హాజరు కానున్నారు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాష్ట్ర పర్యటనలో నిర్వహించాల్సిన బాధ్యతలపై వర్క్​షాప్​లో వివరించనున్నారు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో ఎమ్మెల్యేకు కేటాయించారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలనేది ఇప్పటికే లిస్ట్​రెడీ చేశారు. ఈ నెల 27 వరకు వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి లోకల్​గా పార్టీ పరిస్థితిని తెలుసుకోనున్నారు. అలాగే బూత్ కమిటీల నియామకం, పార్టీ బలోపేతం కోసం నిర్వహిస్తున్న ప్రోగ్రామ్.. ఎవరికి టికెట్ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయి.. వంటి అంశాలపై హైకమాండ్​కు రిపోర్ట్ ఇవ్వనున్నారు. అలాగే ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీ అవుతారు.