కాగజ్ నగర్, వెలుగు: కాజీపేట–బల్లర్షా మధ్య నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ ట్రాక్ కారణంగా వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులకు ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) టీమ్ మెంబర్ హరిణి, డబ్ల్యూఐఐ సైంటిస్ట్ ఉజ్వల్ సూచించారు. మూడో లైన్ పనుల్లో భాగంగా కాగజ్‌నగర్ డివిజన్లో చేపడుతున్న పనులను గురువారం పరిశీలించారు. సిర్పూర్ టీ రేంజ్ మాకుడి సెక్షన్లోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో రైల్వే మూడో లైన్ను పరిశీలించారు.
ఎన్ టీసీఏ ప్రతినిధి హరిణి, ఎఫ్టీపీటీ శాంతారాం, డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రేవాల్, కాగజ్‌నగర్ ఎఫ్డీవో సుశాంత్ సుఖ్ దేవ్ బోబడేతో కలిసి ఓవర్ పాస్లు అవసరమున్న ప్రాంతాలను ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు, పెద్దపులుల మూమెంట్ ఉన్న నేపథ్యంలో వాటి సంచారానికి ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్, సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు తదితరులున్నారు.
