ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు.. రెండు లక్షల మందితో బహిరంగ సభ

ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు.. రెండు లక్షల మందితో   బహిరంగ సభ

మహబూబ్​నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావానికి బీజేపీ సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సభకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ఆదివారం వర్చువల్​గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 

పాలమూరు సెంటిమెంట్​

దేశ ప్రధానిగా మోదీ రెండో సారి పాలమూరుకు వస్తున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలోనూ ఆయన మహబూబ్​నగర్​లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పాలమూరులో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, పాలమూరు, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉండగా, దక్షిణ తెలంగాణలోని నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపేందుకు మోదీ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు స్పష్టమవుతున్నది. 

ఓపెన్​ టాప్ ​జీపుపై ర్యాలీ..

ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో సభా స్థలిని నిర్మిస్తున్నారు. ఇందులో రెండు స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒక స్టేజీ మీద నుంచి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు వచ్చేందుకు ప్రత్యేకంగా ఓపెన్​ టాప్​ జీపును ఏర్పాటు చేశారు. ఈ జీపును గుజరాత్​ నుంచి తెప్పిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల వరకు ప్రధాని ఓపెన్​ టాప్​పై సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు, లీడర్లకు అభివాదం చేస్తూ.. సభా వేదిక మీదకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన జీపుపై వస్తుండగా ఉమ్మడి జిల్లాకు చెందిన 30 మంది మహిళలతో ప్రత్యేకంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

రెండు లక్షల మంది సమీకరణకు కసరత్తు

సభకు ఉమ్మడి జిల్లాతో రంగారెడ్డి, హైదరాబాద్​ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని తరలించేందుకు పార్టీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుతున్నారు. సభకు వచ్చే ప్రజల కోసం అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్​ రెడ్డి మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేడర్​కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సభ ద్వారా కొందరు లీడర్లు బీజేపీలో చేరనున్నారు.

పీఎం పర్యటనపై సీఎస్​ సమీక్ష

హైదరాబాద్, వెలుగు :  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్​3న నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్​శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్​శుక్రవారం సమీక్షించారు. రామ‌‌‌‌‌‌‌‌గుండం ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ 800 మెగావాట్ల  ప్రాజెక్టును వర్చువల్‌‌‌‌‌‌‌‌గా పీఎం  ప్రారంభించనున్నారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్​ఆదేశించారు.  నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నిజామాబాద్ కలెక్టర్, సీపీ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.