సందేశ్​ఖాలీ తుఫాన్​లో టీఎంసీ గాయబ్​ : నరేంద్ర మోదీ

సందేశ్​ఖాలీ తుఫాన్​లో టీఎంసీ గాయబ్​ : నరేంద్ర మోదీ
  • బెంగాల్​లోని బరాసత్​ సభలో ప్రధాని మోదీ కామెంట్​
  • దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో కోల్​కతాలో ప్రారంభం

బరాసత్/కోల్ కతా: బెంగాల్​లోని సందేశ్​ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల తర్వాత తుఫాన్ ఏర్పడిందని, అది రాష్ట్రమంతా వ్యాపించి అధికార తృణమూల్ కాంగ్రెస్ ను ముంచేయడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహిళా శక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బుధవారం బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్​లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

ఇదే జిల్లాలోని సందేశ్​ఖాలీలో మహిళల పట్ల జరిగిన వేధింపులు సిగ్గు చేటు అని మోదీ ఫైర్ అయ్యారు. సందేశ్​ఖాలీలో మహిళలను లైంగికంగా వేధించడంతోపాటు భూములను కబ్జా చేశాడంటూ టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులపై వచ్చిన ఆరోపణలు దేశమంతటా సంచలనం సృష్టించాయి. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత షాజహాన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. క్రిమినల్స్​ను కాపాడేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు అధికారులు మొదట నిరాకరించారన్నారు.

క్రిమినల్స్​కు అండగా టీఎంసీ.. 

రాష్ట్రంలో క్రిమినల్స్​ను రక్షించేందుకు టీఎంసీ అన్నిరకాలుగా ప్రయత్నం చేసిందని మోదీ ఆరోపించారు. మొదట హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు పడటంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. టీఎంసీ గూండాలను వెనకేసుకొస్తూ, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ మన అక్కాచెల్లెళ్లు, బిడ్డలకు ఎన్నటికీ సెక్యూరిటీ ఇవ్వదని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళలపై అత్యాచారానికి పాల్పడితే గరిష్టంగా మరణ శిక్ష సైతం విధించేలా నిబంధన తెచ్చిందన్నారు. ఆపత్కాలంలో మహిళలను ఆదుకునేందుకు కేంద్రం హెల్ప్ లైన్​ను తెస్తే.. రాష్ట్రంలో దానిని అమలు చేయట్లేదన్నారు. బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటూ టీఎంసీ రాష్ట్రానికి గ్రహణంలా పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని, బీజేపీకి ఓటేయాలని కోరారు.   

మోదీని కలిసిన సందేశ్​ఖాలీ మహిళలు 

సందేశ్​ఖాలీలో టీఎంసీ మాజీ నేత షాజహాన్ షేక్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన పలువురు మహిళలు బుధవారం ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదని.. తమకు న్యాయం చేయాలని ప్రధానిని కోరారు. తాము ఎదుర్కొన్న వేధింపులను మోదీకి చెప్పుకుని కంటతడి పెట్టుకున్నారని బీజేపీ నేతలు  వెల్లడించారు. 

మహిళల భద్రతపై మోదీ స్పీచ్​లా?: టీఎంసీ

ప్రధాని మోదీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని టీఎంసీ విమర్శించింది. ఈ మేరకు టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పందించారు. బీజేపీ నేతలు తమను లైంగికంగా వేధించారని మహిళా రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేసిన విషయం గుర్తుచేస్తూ.. మహిళల భద్రతపై తమకు 
ఉపన్యాసాలు ఇచ్చే హక్కు మోదీకి లేదన్నారు.

అండర్ వాటర్ మెట్రో ప్రారంభం
 
దేశంలోనే తొలిసారిగా నదీ గర్భంలో నిర్మించిన మెట్రో లైన్ ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. కోల్ కతా మెట్రోలో భాగంగా హుగ్లీ నదిలో నిర్మించిన ఎస్ ప్లనేడ్–హౌరా మైదాన్ సెక్షన్ అండర్ వాటర్ ట్రాన్స్ పోర్టేషన్ టన్నెల్ ను ఆయన లాంచ్ చేశారు. అనంతరం ఎస్ ప్లనేడ్ నుంచి హౌరా వరకూ ఆయన అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తూ స్కూలు విద్యార్థులతో ముచ్చటించారు. అదే రూట్ లో తిరిగి ఎస్ ప్లనేడ్ కు చేరుకున్నారు. మోదీ వెంట బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.

32 మీటర్ల దిగువన మెట్రో స్టేషన్

ఈస్ట్–వెస్ట్ కారిడార్​లో భాగంగా 4.8 కి.మీ. పొడవున ఎస్ ప్లనేడ్-–హౌరా మైదాన్ అండర్ వాటర్ టన్నెల్​ను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి రూ. 4,960 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో నదిలో నిర్మించిన తొలి ట్రాన్స్ పోర్టేషన్ టన్నెల్ గా ఇది నిలిచింది. హుగ్లీ నదీ గర్భంలో తూర్పు నుంచి పశ్చిమానికి కోల్​కతా నుంచి హౌరా మధ్య ఈ టన్నెల్ ను నిర్మించారు. హౌరా మెట్రో స్టేషన్ గ్రౌండ్ లెవల్​కు 32 మీటర్ల దిగువన ఉంది.

దేశంలో డీపెస్ట్ మెట్రో స్టేషన్ కూడా ఇదేనని అధికారులు వెల్లడించారు. ఈ కారిడార్ పొడవు మొత్తం 16.6 కి.మీ. కాగా.. 10.8 కి.మీ. మేరకు అండర్ గ్రౌండ్ లో ఉండనుంది. అలాగే జోకా–ఎస్ ప్లనేడ్ లైన్ లో1.25 కి.మీ. పొడవైన తరతలా–మేజర్ హట్ సెక్షన్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సెక్షన్ ను రూ. 520 కోట్లతో నిర్మించారు. అలాగే న్యూ గడియా–ఎయిర్ పోర్ట్ లైన్ మార్గంలో రూ. 1,430 కోట్లతో 
నిర్మించిన కావి సుభాష్–హేమంత ముఖోపాధ్యాయ్ సెక్షన్ ను ప్రధాని ప్రారంభించారు.