వివక్ష ఎందుకు..? కేంద్రానికి కేటీఆర్​ బహిరంగ లేఖ

వివక్ష ఎందుకు..? కేంద్రానికి కేటీఆర్​ బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు : పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని మంత్రి కేటీఆర్​మండిపడ్డారు. తుదిదశ పర్యావరణ అనుమతులు నిరాకరించడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచే రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించేలా ప్రధాని మోదీ పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో కరువు ప్రాంతాలైన నాగర్‌‌ కర్నూల్, మహబూబ్‌‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు పచ్చబడటం కేంద్రానికి ఇష్టం లేదా’ అని ప్రశ్నించారు. 12.03 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది మందికి తాగునీటి భరోసా ఇచ్చే ప్రాజెక్టుకు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని ఫైర్​అయ్యారు. మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకే పాలమూరు లిఫ్ట్​స్కీమ్​ చేపట్టామన్నారు. 

దీనికి జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెడుతోందని, ఇప్పుడు అనుమతులు ఇవ్వడంలోనూ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. కర్నాటకలో అప్పర్​భద్రకు జాతీయ హోదా ఇచ్చి, పాలమూరుకు ఎత్తిపోతలకు మొండి చేయి చూపించడం కేంద్రానికి తెలంగాణపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కృష్ణా జలాల పంపిణీలో నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కొత్త ట్రిబ్యునల్​వేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. నీటి వినియోగం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర జాబితాలోని అంశమైనా, కేంద్రం నుంచి అనుమతులు లేకుండా ఇరిగేషన్​ ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందన్నారు.