V6 News

చరిత్ర సృష్టిస్తున్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లు 21వ శతాబ్దాంలోనే గొప్ప నిర్ణయం:ప్రధాని మోదీ

చరిత్ర సృష్టిస్తున్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లు 21వ శతాబ్దాంలోనే గొప్ప నిర్ణయం:ప్రధాని మోదీ
  • మహిళల దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా చారిత్రక అడుగు
  • బాధ్యతాయుతంగా అమలుచేస్తం
  • ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలి.. 
  • సహకారం అందించాలని వినతి

న్యూఢిల్లీ: భారత పార్లమెంటు త్వరలో ఒక నవ చరిత్రను సృష్టించబోతున్నదని, మహిళల దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి ప్రధాని ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖలు రాశారు. 

ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’లో ప్రధాని మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘‘ఈ నిర్ణయం దేశంలోని మహిళా శక్తికి అంకితం. ఇది నారీ శక్తి పట్ల మనకున్న గౌరవానికి ప్రతిరూపం. భారత పార్లమెంటు ఒక నవ చరిత్రను సృష్టించేందుకు అతి దగ్గరలో ఉంది. 

గతాన్ని ప్రతిబింబిస్తూనే, భవిష్యత్తు తీర్మానాలను నెరవేర్చే చరిత్ర ఇది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, అది మన పని సంస్కృతిలో, నిర్ణయాధికార ప్రక్రియలో సహజ భాగం కావాలి. రాష్ట్ర అసెంబ్లీల నుంచి దేశ పార్లమెంటు వరకు మహిళలు చేస్తున్న దశాబ్దాల నిరీక్షణకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చేసింది” అని వ్యాఖ్యానించారు.

  • దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక ఘట్టం

మహిళా రిజర్వేషన్​ బిల్లు అమలు దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక ఘట్టమని, 21వ శతాబ్దంలో దేశం తీసుకోబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఇది ఒకటి అని మోదీ అన్నారు. అత్యంత బాధ్యతాయుతంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. భారతీయ మహిళలు తమకంటూ ఒక ప్రత్యేక వారసత్వాన్ని సృష్టించుకున్నారని ప్రధాని కొనియాడారు. 

‘‘రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు దేశంలోని అత్యున్నత పదవులను మహిళలు సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారు” అని పేర్కొన్నారు. 2023లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని, 2029 నాటికి దీనిని పక్కాగా అమలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

  • మహిళా భాగస్వామ్యంతోనే మార్పు..

నిర్ణయాధికార ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరిగితే వ్యవస్థలో మరింత సున్నితత్వం, స్పందన పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. దీనికి ‘జల్‌‌ జీవన్ మిషన్’ విజయాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. పంచాయతీ స్థాయిలో మహిళలు పోషించిన పాత్ర వల్ల ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. గతంలో ఇండ్లతోపాటు భూమి, దుకాణం.. ఇలా ఏదైనా పురుషుల పేర్ల మీదే ఉండేవని తెలిపారు.  

అదంతా సహజమనే భావన ఉండేదని, కానీ తాము పీఎం ఆవాస్ యోజన తీసుకువచ్చి మహిళ పేరు మీదే ఇండ్ల రిజిస్ట్రేషన్‌‌కు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు.  మహిళా సాధికారత కోసం సుకన్య సమృద్ధి యోజన, మిషన్ ఇంద్రధనుష్ , స్వచ్ఛ భారత్, ఖేలో ఇండియా,  సైనిక్ స్కూళ్లు, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ప్రవేశం, జన్ ధన్ ఖాతాల ద్వారా కోట్లాది మంది మహిళలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడంలాంటి విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చామని వివరించారు. ఈ స్కీమ్స్‌‌ ద్వారా మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచినట్టు వెల్లడించారు. మహిళల జీవితంలోని ప్రతి దశలోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.