స్టూడెంట్ల జీవితాలను మార్చేది గురువులే

స్టూడెంట్ల జీవితాలను మార్చేది గురువులే

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్​ ఎకో సిస్టంను బలోపేతం చేసే విషయంలో మన దేశం సరైన దిశలోనే ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త ఎడ్యుకేషన్​ పాలసీ(ఎన్ఈపీ)ని ప్రపంచం కొనియాడుతోందన్నారు. ఈ పాలసీకి రూపకల్పన చేయడంలో టీచర్లు కీలక పాత్ర పోషించారన్నారు. సోమవారం ఢిల్లీలో టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అవార్డులు సాధించిన టీచర్లతో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా టీచర్ల పాత్రను మోడీ కొనియాడారు.

స్టూడెంట్లకు చదువు చెప్పడమే కాకుండా వారి జీవితాలను మార్చేది గురువులే అని అన్నారు. 2047 నాటికి మన దేశం ఎలా ఉండాలో డిసైడ్​ చేసేది.. అందుకు యువతను సిద్ధం చేసేది టీచర్లే అని అన్నారు. సక్సెస్​ఫుల్​ టీచర్లకు స్టూడెంట్లందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువా కాదన్నారు. సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. ఇది సాధిస్తే భవిష్యత్​లో వారు ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కోగలుగుతారని చెప్పారు. బ్రిటన్​ను వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలవడం ప్రత్యేకమైనదని అన్నారు. 250 ఏండ్లు మనల్ని పాలించిన వారిని మనదేశం ఇప్పుడు దాటేసిందని మోడీ చెప్పారు.