మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం, వేగంగా విచారణ జరిపి, శిక్షలు వేయాలి: ప్రధాని మోదీ

మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం, వేగంగా విచారణ జరిపి, శిక్షలు వేయాలి: ప్రధాని మోదీ
  • బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు ఆందోళనకరం
  • ఇప్పటికే కఠిన చట్టాలు తెచ్చాం..వాటిని బలోపేతం చేస్తామని ప్రకటన
  • వర్చువల్​ మోడ్​లో 3 వందేభారత్​ రైళ్ల ప్రారంభం

న్యూఢిల్లీ: మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాలని ప్రధాని మోదీ అన్నారు. అలా జరిగినప్పుడే మహిళల భద్రతకు భరోసా లభిస్తుందని చెప్పారు.  శనివారం ఢిల్లీలోని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండపంలో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో  జిల్లా న్యాయవ్యవస్థలపై  జాతీయ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. 

అతివలు, చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి, శిక్షలు విధించాలని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే కఠిన చట్టాలు తెచ్చామని, వాటిని మరింత బలోపేతం చేసి క్రియాశీలకంగా పనిచేసేలా చూస్తామని చెప్పారు. కోల్‌‌‌‌‌‌‌‌కతాలోని ఆర్జీ కర్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ కళాశాలలో ట్రెయినీ​ డాక్టర్​పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఇద్దరు ఎల్​కేజీ చిన్నారులపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వికసిత్ ​భారత్.​.140 కోట్ల ప్రజల సంకల్పం 

దేశంలోని 140 కోట్ల మంది సంకల్పం ఒక్కటేనని, అది వికసిత్​ భారత్​ అని మోదీ తెలిపారు.  దేశ ప్రజలు అభివృద్ధి చెందిన, సరికొత్త భారత్‌‌‌‌‌‌‌‌ను చూడాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. గత పదేండ్లలో కేసుల విచారణలో జాప్యాన్ని తొలగించేందుకు వీలుగా తీసుకొన్న చర్యలను మోదీ వివరించారు. సుప్రీంకోర్టు 75 ఏండ్ల స్మారక చిహ్నం స్టాంప్‌‌‌‌‌‌‌‌ను ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. గత పదేండ్లలో కోర్టుల మోడరనైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించారు. అధునాతన సాంకేతికత పోలీస్, ఫోరెన్సిక్, జైలు, కోర్టు లాంటి విభాగాల పనితీరును స్పీడప్​ చేస్తుందని మోదీ అన్నారు. మనం పూర్తిగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే న్యాయ వ్యవస్థ వైపు పయనిస్తున్నామని చెప్పారు.

అందరికీ సౌకర్యవంతమైన ప్రయాణం

సమాజంలోని అన్నివర్గాలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అప్పటి వరకూ విశ్రమించేదే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఏండ్లుగా నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో రైల్వేలు ఎంతో పురోగతిని సాధించాయని పేర్కొన్నారు. శనివారం ఆయన మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్​కోయిల్​మధ్య మూడు కొత్త వందే భారత్​ఎక్స్​ప్రెస్​రైళ్లను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. మోడరైజేషన్, వందేభారత్​రైళ్ల విస్తరణతో దేశం.. వికసిత్​ భారత్​ లక్ష్యం దిశగా పయనిస్తున్నదని చెప్పారు.

ప్రజాస్వామ్యానికి రక్షణగా న్యాయవ్యవస్థ  

దేశంలో ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ రక్షణగా నిలుస్తుందని, సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ బాధ్యతగా పనిచేస్తున్నాయని మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు 75 ఏండ్ల ప్రయాణంతోపాటు భారత ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉందని మోదీ చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. జాతీయ సమగ్రతను కాపాడిందని కొనియాడారు. దేశంలో మహిళల భద్రత కోసం అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని, 2019 లో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో జిల్లా మానిటరింగ్ కమిటీలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.