
న్యూఢిల్లీ : దేశ చరిత్రలో ఆర్టికల్ 370 రద్దు కీలక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్ పురోగతి, శ్రేయస్సుకు కొత్త శకాన్ని ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 5, 2019న పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం ప్రధాని మోదీ ట్వీట్‌చేశారు. ‘‘మన దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమైన ఆర్టికల్ 370, 35(ఏ)ను రద్దు చేస్తూ భారత పార్లమెంటు నిర్ణయించి నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్ పురోగతి, శ్రేయస్సుకు కొత్త శకానికి నాంది పలికింది. రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు, మహిళల దృక్పథానికి అనుగుణంగా భారత రాజ్యాంగం ఈ ప్రదేశాలలో అక్షర స్ఫూర్తితో అమలైందని దీని అర్థం. ఈ ఆర్టికల్రద్దుతో అప్పటి దాకా అభివృద్ధి ఫలాలు అందుకోలేని మహిళలు, యువత, వెనుకబడిన, గిరిజన, అట్టడుగు వర్గాలకు భద్రత, గౌరవం, ఉపాధి అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌ను పీడిస్తున్న అవినీతిని అరికట్టేలా చూసింది’’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమర్‌నాథ్ యాత్ర ఒక రోజు నిలిపివేత
ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు అమర్‌నాథ్ యాత్రను ఒకరోజు నిలిపివేశారు. సోమవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవచ్చనే అనుమానంతో శాంతిభద్రతల పరిరక్షణకు యాత్రను నిలిపివేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం1,112 మంది భక్తులతో కూడిన బ్యాచ్ భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో కాశ్మీర్‌లోయకు బయలుదేరింది. అయితే, సోమవారం మాత్రం కొత్త లాట్‌ను నిలిపివేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: ఖర్గే
సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో బీజేపీ అనుసరిస్తున్న విధానం కాశ్మీరీలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్కడ వెంటనే ఎలక్షన్స్జరపాలన్నారు.
మోదీతో జైశంకర్ భేటీ
బంగ్లాదేశ్ లోని తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పొరుగు దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి ఆయన వివరించారు. బంగ్లాదేశ్ లో చెలరేగుతున్న హింస.. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా.. దేశం పాలన బాధ్యతలను సైన్యం చేపట్టడం వంటి అంశాలను తెలియజేశారు. కాగా, బంగ్లాదేశ్ సంక్షోభంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలిసి చర్చించారు. కాగా, బంగ్లాదేశ్ లో సంక్షోభం నేపథ్యంలో ఆ దేశం నుంచి భారత్ లోకి చొరబాట్లు జరగకుండా అడ్డుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్రిపురలోని గిరిజన తెగల పార్టీ తిప్ర మోథా అధినేత ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దేబ్ బర్మకు ఆయన ఈ మేరకు సోమవారం హామీ ఇచ్చారు.