మార్చి 4, 5న ప్రధాని మోదీ పర్యటన

మార్చి 4, 5న ప్రధాని మోదీ పర్యటన
  • రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొత్తం రూ.15,718 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. 4న తొలి రోజు ఆదిలాబాద్​ పర్యటనలో రూ.6,697 కోట్ల పనులను ప్రారంభించి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 

రెండో రోజు పర్యటనలో బేగంపేట విమానాశ్రయంలో రూ.400 కోట్లతో  ఏర్పాటు చేసిన పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో)ను ప్రారంభిస్తారు. అలాగే, పలు హైవేల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.3,339 కోట్లతో ఏర్పాటు చేసిన పారాదీప్​– హైదరాబాద్​ గ్యాస్​ పైప్​లైన్​ను, రూ.1,165 కోట్లతో హైదరాబాద్, సికింద్రాబాద్​లలో 103 కిలోమీటర్ల మేర చేపట్టిన ఎంఎంటీఎస్​ ఫేజ్​ 2ను, ఘట్​కేసర్ –​ లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్​ రైలునూ మోదీ ప్రారంభించనున్నారు. 

ప్రధాని పర్యటనకు సీఎం రేవంత్​

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు. గతంలో ప్రధాని చాలాసార్లు అధికారిక పర్యటనలకు వచ్చినా.. మాజీ సీఎం కేసీఆర్​ ఆయా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ప్రధాని చేస్తున్న తొలి పర్యటనలో.. సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు. ఈ మేరకు పీఎంవో ఆఫీస్​ నుంచి సీఎం రేవంత్​ రెడ్డికి ఆహ్వానం కూడా వెళ్లిందని తెలిసింది.