తలైవా ఎలా ఉన్నారు..?: రజినీకాంత్ సతీమణికి ప్రధాని మోడీ ఫోన్ కాల్

తలైవా ఎలా ఉన్నారు..?: రజినీకాంత్ సతీమణికి ప్రధాని మోడీ ఫోన్ కాల్

స్టార్ హీరో రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీశారు. రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారన్న విషయం తెలుకున్న మోడీ.. వెంటనే  రజినీ సతీమణి లతకు ఫోన్ చేశారు. రజినీ హెల్త్ కండిషన్ గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. రజనీకి జరిగిన అపరేషన్‎కు సంబంధించిన వివరాలతో పాటు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పీఎంకు లత వివరించారు. రజినీకాంత్  ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ వాకబు చేసిన విషయాన్ని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. రజినీ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రార్థించారు.

  ‘‘రజినీకాంత్ హెల్త్ కండిషన్ గురించి ఆరా తీయడానికి ప్రధాని మోడీ రజినీకాంత్ సతీమణి లతకు ఫోన్ చేశారు. రజినీకి జరిగిన అపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ త్వరగా కోలువాలని మోడీ ఆకాంక్షించారు’’ అని అన్నామలై ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‎లతో బిజీగా ఉన్న రజినీకాంత్ అక్టోబర్ 1వ తేదీన అనారోగ్యానికి గురి అయ్యారు. గుండెకు సంబంధించి సమస్యతో తలైవా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. 

ఈ మేరకు వైద్యులు విజయవంతంగా రజినీకాంత్ అపరేషన్ నిర్వహించి గుండెలో స్టంట్ వేశారు.  ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరో రెండు మూడు రోజుల్లో రజినీని డిశార్జ్ చేయనున్నట్లు సమాచారం. రజినీ నటించి మల్టీ-స్టారర్ చిత్రం 'వెట్టయన్' త్వరలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇటీవల ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను కూడా మూవీ యూనిట్ భారీ ఎత్తున నిర్వహించింది. 

ఈ ఈవెంట్‎లో తలైవా ఎంతో ఊషారుగా కనిపించారు. ఈ కార్యక్రమంలో రజినీ తన నృత్యాలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇంతలోనే అనారోగ్యానికి గురికావడంతో రజినీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. తలైవా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి  పీల్చుకున్నారు. రజినీ త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నారు.