
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం.. 80వ యూఎన్‌జీఏ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్నాయి.
23న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, 26న మోదీ మాట్లాడనున్నారు. ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధానులు కూడా అదే రోజు ప్రసంగించనున్నారు. కాగా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ నెల 20, 21 తేదీల్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలు, సహకారాలపై ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో చర్చలు జరపనున్నారు.