కాంగ్రెస్​కు పేదల కష్టాలు పట్టవు .. కాంగ్రెస్ కరప్షన్ లైసెన్స్ రద్దు చేశా: ప్రధాని

కాంగ్రెస్​కు పేదల కష్టాలు పట్టవు .. కాంగ్రెస్ కరప్షన్ లైసెన్స్ రద్దు చేశా: ప్రధాని
  • బెదిరింపులకు భయపడబోను
  • దేశం మొత్తం నా వెంటే ఉంది
  • చత్తీస్​గఢ్ ర్యాలీలో మోదీ వెల్లడి

రాయ్​పూర్/జగ్దల్​పూర్ (చత్తీస్​గఢ్): దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అధికారం చేపట్టిన కాంగ్రెస్.. కొన్ని దశాబ్దాల పాటు సాధారణ, పేద ప్రజల బాధలు, కష్టాలు అర్థం చేసుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి అనేది ఇండియా ఐడెంటిటీగా ఉండేదని అన్నారు. దోచుకునేందుకు తమకు లైసెన్స్‌ ఉందని కాంగ్రెస్‌ భావించేదని, 2014లో అధికారంలోకి వచ్చాక ఆ లైసెన్స్​ను రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు ఇండియా అంటే ఓ శక్తి అని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని అన్నారు. బస్తర్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

కాంగ్రెస్ మేనిఫెస్టో.. ముస్లిం లీగ్​మేనిఫెస్టోలా ఉంది. కేవలం ఓ వర్గానికి లబ్ధి చేకూర్చేలా హామీలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలన మొత్తం అవినీతిమయంగా సాగింది. కరోనా టైమ్​లో పేదలకు ఫ్రీగా వ్యాక్సిన్ అందజేశాం. రేషన్ ఇస్తున్నాం. పదేండ్ల బీజేపీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం. కాంగ్రెస్ పాలనలో వీరంతా అవినీతి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

కరప్షన్ అనేది పేదల హక్కులను హరిస్తుంది. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో లక్షల కోట్ల స్కామ్​లు జరిగాయి. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన ప్రతీ రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరిందని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే స్వయంగా ఒప్పుకున్నారు’’ అని మోదీ గుర్తు చేశారు. 2014లో తాము అధికారంలో వచ్చాక దోపిడీ లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు.

పదేండ్లలో రూ.34లక్షలు కోట్లు ట్రాన్స్​ఫర్

పదేండ్ల బీజేపీ పాలనలో రూ.34లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ నుంచి పంపిన ప్రతి రూపాయి పేదలకు చేరిందని తెలిపారు. అదే పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే.. రూ.34 లక్షల కోట్లలో రూ.28లక్షల కోట్లు ఆ పార్టీ లీడర్ల జేబుల్లోకి వెళ్లేవని, మిగిలిన రూ.6లక్షల కోట్లు మాత్రమే పేదలకు చేరేవని ఆరోపించారు. తమకు ప్రజలు అధికారం ఇవ్వడం కారణంగానే.. ఈ లూటీ లైసెన్స్​ను రద్దు చేయగలిగామని తెలిపారు. ‘‘లూటీని అడ్డుకున్నందుకు చత్తీస్​గఢ్ ప్రతిపక్ష నేత చరణ్​దాస్ ఇష్టమొచ్చినట్టు తిడ్తున్నడు. 

దేశ ప్రజల ప్రేమ, అభిమానం నన్ను ఓ కవచంలా రక్షిస్తున్నది. అవినీతికి వ్యతిరేకంగా ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించానో.. అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారు. నా తల పగులగొట్టాలని అపోజిషన్ లీడర్లు యువతను రెచ్చగొడ్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. దేశమే నా కుటుంబం.. నా ఫ్యామిలీ 

మొత్తం నా వెనుక ఉన్నది’’ అని మోదీ అన్నారు.