
- ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆరోపణ
- పార్లమెంట్ టైమ్ వృథా చేయొద్దు..
- సమస్యలపై చర్చించాలని హితవు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ దళ్ కోసం కాదని.. ‘దేశం’ కోసం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొన్ని పార్టీలు పార్లమెంట్‌ను కుట్రపూరిత రాజకీయ వేదికలుగా మార్చుకున్నాయని మండిపడ్డారు. ఎంతో విలువైన పార్లమెంట్ సమయాన్ని వృథా చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
కొందరు ఎంపీలు.. ఇతరులను తమ నియోజకవర్గ సమస్యలపై సభలో మాట్లాడే సమయం ఇవ్వకుండా అడ్డుకుంటున్నరు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలి. ఉభయ సభల సెషన్ అంటేనే చాలు.. నిరసనలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నరు. ఎంపీలతో పాటు ప్రధాని గొంతు నొక్కేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానిని కూడా సభలో మాట్లాడనివ్వడం లేదు’’అని అన్నారు.
ఒకరిపై ఒకరు విమర్శలు వద్దు
‘‘నేను ఎంపీలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను.. వారు ఏ పార్టీ వారైనా కావచ్చు. జనవరి నుంచి ఎన్నికల పోరు మొదలైంది. ప్రజలకు మనం ఏం చెప్పాలనుకున్నామో.. చెప్పేశాం. కొందర్ని గెలిపిస్తే.. మరికొందరిని ఓడించారు. ఎన్నికల తీర్పు స్పష్టంగా వచ్చింది. ఇక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆపాలి. గెలిచిన ప్రతి ఒక్కరూ పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించాలి. ఇది తమ బాధ్యతగా భావించాలి. వచ్చే ఐదేండ్లు దేశం కోసం పోరాడాలి’’ అని అన్నారు.
ఇప్పటివరకు జరిగిన సభల్లో రెండున్నర గంటలు తనపై అపోజిషన్ పార్టీలు నోటికొచ్చినట్లు మాట్లాడాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కామెంట్లకు స్థానం ఉండదన్నారు. ‘‘అపోజిషన్ పార్టీల కామెంట్లను దేశ ప్రజలు వింటూనే ఉన్నారు. సభ సజావుగా సాగించేందుకు సహకరించాలి. ఈసారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ఎంతో కీలకమైంది. వచ్చే ఐదేండ్లకు అందరినీ దిశానిర్దేశం చేస్తది. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ పునాది వేస్తుంది. దాదాపు 60 ఏండ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టింది’’ అని అన్నారు.