మన వస్తువులకు మస్తు గిరాకీ

మన వస్తువులకు మస్తు గిరాకీ

న్యూఢిల్లీ: మనదేశంలో తయారైన వస్తువులకూ ప్రపంచమంతటా గిరాకీ పెరుగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ ​డాలర్ల (దాదాపు రూ.30 లక్షల కోట్లు)విలువైన ఎగుమతులను సాధించగలడమే ఇందుకు రుజువని స్పష్టం చేశారు. తన రేడియో ప్రోగ్రామ్​ ‘మన్​ కీ బాత్​’లో ఆదివారం ఆయన మాట్లాడుతూ ‘‘ఇండియా సత్తా ఏంటో ఈ ఎగుమతులు నిరూపించాయి. ఇది మనకు గర్వకారణం. మన వస్తువులు మరిన్ని దేశాలకు వెళ్తున్నాయి. మేడిన్​ ఇండియా వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు మనదేశ ఎగుమతుల విలువ 100 బిలియన్​ డాలర్ల వరకు ఉండేది. కొంతకాలం తరువాత 150 బిలియన్​ డాలర్లకు, 200 బిలియన్​ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 400 బిలియన్​ డాలర్లు. చిన్న వ్యాపార సంస్థలు ఎదగడం అందరికీ గర్వకారణం. లఢక్​ అప్రికాట్, తమిళనాడులో పండే అరటి, హిమాచల్​లో సాగు చేసే తృణధాన్యాలు, బీజాపూర్​ పండ్లు, కూగాయలు, చందోలి బ్లాక్​ రైస్​కు విదేశాల్లో డిమాండ్​ ఉంది. మేకిన్​ ఇండియా వస్తువుల లిస్టు చాలా పెద్దది. మన రైతులు, మాన్యుఫ్యాక్చరర్లు, ఇండస్ట్రీ కష్టం వల్లే ఈ విజయం సాధ్యమైంది”అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు ‘వోకల్​ ఫర్​ వోకల్​’ (లోకల్​ తయారీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం)కు మద్దతు ఇస్తే మన మస్తువులకు విలువ మరింత పెరుగుతుందని అన్నారు.  
 జీఈఎంలో చిన్న వ్యాపారుల సత్తా...

గవర్నమెంట్​ ఈ–మార్కెట్ (జీఈఎం) ​ద్వారా సేకరిస్తున్న వాటిలో చిన్న వ్యాపారుల వస్తువుల వాటాయే ఎక్కువని మోడీ  చెప్పారు.   దేశంలోని దాదాపు 1.25 లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు, చిన్న దుకాణదారులు తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి అమ్మారని తెలిపారు.  జీఈఎం పోర్టల్ ద్వారా గత ఏడాది కాలంలో  ప్రభుత్వం రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేసిందని వెల్లడించారు. భారతదేశ ఎగుమతుల్లో దాదాపు సగం ఎంఎస్​ఎంఈ (చిన్న, మధ్యస్థాయి కంపెనీలు) రంగం నుండి వచ్చాయన్నారు.  ‘‘ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి వస్తువులను అమ్మేవి.  ఇప్పుడు దేశం మారుతోంది.  పాత పద్ధతులు కూడా మారుతున్నాయి. చిన్న దుకాణదారులు కూడా తమ వస్తువులను ప్రభుత్వానికి అమ్మవచ్చు.   జీఈఎం ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్  ఎంఎస్​ఎంఈలకు ఎంతో మేలు చేస్తోంది. ఆర్డర్ విలువలో 57 శాతం ఎంఎస్​ఎంఈ రంగం నుండి వచ్చింది” అని ఆయన గురువారం ట్వీట్ చేశారు.  మనదేశ మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​ బలోపేతం కావడానికి  మన రైతులు, చేతివృత్తుల కళాకారులు, మన నేత కార్మికులు, ఇంజనీర్లు,  చిన్న వ్యాపారవేత్తలు, ఎస్​ఎంఎంఈ రంగం కారణమని అన్నారు. వీరి కష్టం వల్లనే 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి లక్ష్యం నెరవేరిందని  పేర్కొన్నారు. ఆగస్ట్ 2016లో ప్రారంభమైన జీఈఎంలో 40 లక్షల మంది అమ్మకందారులు, దాదాపు 60 వేల మంది కొనుగోలుదారులు ఉన్నారు. ఇప్పటివరకు 2.20 లక్షల కోట్ల రూపాయల విలువైన 97.52 లక్షల ఆర్డర్‌‌‌‌లు ప్రాసెస్ అయ్యాయి.  గత 12 నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.