
- కుటుంబ సభ్యులతో కలిసి పీఎంతో భేటీ అయిన ఎంపీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని, ఇంకొంచెం కష్టపడితే అధికారంలోకి వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని మోదీ చెప్పారన్నారు. మంగళవారం పార్లమెంట్లోని పీఎం ఆఫీస్లో లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులతో మోదీని కలిశారు. 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లెవనెత్తుతున్న ప్రశ్నలు, అంశాల వారీగా చర్చల్లో పాల్గొంటున్న లక్ష్మణ్ తీరును మోదీ మెచ్చుకున్నారు. ఈ తీరును ఇలాగే కొనసాగించాలని, పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
మోదీతో భేటీ అనంతరం లక్ష్మణ్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడలేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఆప్ అవినీతి కుంభకోణాలను తారుమారు చేయడానికే మాత్రమే కేంద్రం తెచ్చిన ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తోందన్నారు. ఆప్ లాంటి అవినీతి పార్టీకి బీఆర్ఎస్ ఎంపీల మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. అవినీతి పార్టీలకు చెక్ పెట్టేందుకు మరో ఉద్యమం చేపట్టబోతున్నానని లక్ష్మణ్ చెప్పారు. ఇండియా కూటమిలోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. ఆ విశ్వాసాన్ని పెంచుకునేందుకే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు.