ఆర్టికల్‌ 370 రద్దు : సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది : మోదీ ట్వీట్

ఆర్టికల్‌ 370 రద్దు : సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది : మోదీ ట్వీట్

ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై సోమవారం (డిసెంబర్ 11న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ రద్దుపై 2019, ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. 

సుప్రీంకోర్టు తీర్పు జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌లోని ప్రజలందరి ఐక్యతను చాటి చెప్పిందన్నారు మోదీ. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లోని ప్రజల కలలను నెరవేర్చడానికి తాము నిబద్దతో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రగతి ఫలాలు చేరుస్తామన్నారు. అంతేకాదు.. ఆర్టికల్ 370 రద్దు కారణంగా నష్టపోయిన వారిని, బడుగు, బలహీన అట్టడుగు వర్గాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సుప్రీంకోర్టు తీర్పు జమ్మూకాశ్మీర్ ప్రజలందరీ ఆశాకిరణం అని, ఉజ్వల భవిష్యత్తుకు ఒక వాగ్దానం లాంటిదన్నారు. ఐక్యంగా ఉండే భారతదేశాన్ని నిర్మించాలనుకునే తమ సంకల్పానికి సుప్రీంతీర్పు ఒక నిదర్శనం అని చెప్పారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా సోమవారం (డిసెంబర్ 11న) ఆ తీర్పును వెలువరించింది.