మాది సక్సెస్​ఫుల్ కూటమి.. ఎన్డీయే అంటేనే గుడ్ గవర్నెన్స్: మోదీ

మాది సక్సెస్​ఫుల్ కూటమి.. ఎన్డీయే అంటేనే గుడ్ గవర్నెన్స్: మోదీ
  • మా గెలుపును తక్కువ చేయాలని ఇండియా కూటమి చూసింది
  • పదేండ్లలో కాంగ్రెస్​కు 100 సీట్లు కూడా దాటలే
  • తెలంగాణ, కర్నాటక, ఒడిశాలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయాయి
  • ఏపీ ప్రజల ప్రేమాభిమానాలు మరవలేనివి.. పవన్ అంటే వ్యక్తి కాదు ఒక తుఫాన్
  • చంద్రబాబు, నితీశ్​తో దోస్తీ కలిసి వచ్చింది
  • ఎన్డీయే ఎంపీల మీటింగ్​లో వ్యాఖ్యలు 
  • ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రాష్ట్రపతి.. రేపు సాయంత్రం ప్రధానిగా ప్రమాణం

న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే ఎన్డీయే అత్యంత సక్సెస్ ఫుల్ కూటమి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంఖ్యాపరంగా చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వమే అత్యంత బలమైన సంకీర్ణ సర్కారు అని ఆయన తెలిపారు. ‘‘మా కూటమి మూడు సార్లు సక్సెస్​ఫుల్​గా ప్రభుత్వాన్ని నడిపింది. ఇప్పుడు నాలుగోసారి అధికారం చేపట్టబోతోంది. ఎన్డీయే అనేది అధికారం కోసం ఒకే వేదికపైకి వచ్చిన పార్టీల కూటమి కాదు. 

దేశమే ఫస్ట్ అనే సూత్రానికి కట్టుబడి ముందుకొచ్చిన అలయెన్స్. ఎన్డీయే అంటే.. న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, యాస్పిరేషనల్ ఇండియా” అని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్ లోని సెంట్రల్ హాల్​లో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో మోదీని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ లీడర్​గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ కూటమిలో పరస్పర నమ్మకమే కేంద్ర బిందువు అని అన్నారు. 

తన ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలనూ ఏకాభిప్రాయంతో తీసుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. పార్లమెంట్ లోనూ పార్టీలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తామన్నారు. ఎన్డీయే కూటమి ‘దేశం ఫస్ట్’ అనే సూత్రానికి కట్టుబడి ఉందన్నారు. సమావేశంలో ఎన్డీయేలోని మొత్తం 21 పార్టీల ఎంపీలు, ఆయా పార్టీల కీలక నేతలు చంద్రబాబు నాయుడు (టీడీపీ), నితీశ్ కుమార్ (జేడీయూ), ఏక్ నాథ్ షిండే (శివసేన), చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ ఆర్ వీ), హెచ్ డీ కుమారస్వామి (జేడీఎస్), అజిత్ పవార్ (ఎన్ సీపీ), అనుప్రియా పటేల్ (అప్నా దళ్ ఎస్), పవన్ కల్యాణ్ (జనసేన), ఇతర నేతలు పాల్గొన్నారు.  

కాంగ్రెస్ కు100 సీట్లు కూడా రాలేదు.. 

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం100 సీట్ల మార్కును కూడా చేరలేకపోయిందని మోదీ అన్నారు. గత మూడు లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లన్నింటిని కలిపినా.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినన్ని సీట్లు కూడా లేవన్నారు. ఇండియా కూటమి నేతలు తొలుత ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడారని, కానీ వారిని ఈవీఎంలే జూన్ 4న సైలెంట్ అయ్యేలా చేశాయన్నారు. ‘‘మా పదేండ్ల పాలన జస్ట్ ట్రైలర్ మాత్రమే. దేశ అభివృద్ధి కోసం మేం మరింత కష్టపడి, వేగంగా పని చేస్తాం. మేం చెప్పింది చేస్తామని దేశ ప్రజలకు కూడా తెలుసు” అని ఆయన చెప్పారు.  

ఎన్డీయే లోక్ సభాపక్ష నేతగా మోదీ

ఎన్డీయే లోక్ సభాపక్ష నేతగా నరేంద్ర మోదీని ఆ కూటమి ఎంపీలు అధికారికంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్ సెంట్రల్ హాల్ లో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ ఎంపీలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మోదీని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్ సభలో బీజేపీ పక్ష నేతగా ప్రతిపాదిస్తూ రాజ్ నాథ్ ప్రవేశపెట్టిన మరో రెండు తీర్మానాలకు ఆ పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీ మద్దతు పలకగా.. పార్టీ ఎంపీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. 

రేపు సాయంత్రం ప్రమాణం 

కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే కూటమి నేత నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ఎన్డీయే లోక్ సభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత మోదీ తన కూటమి నేతలతో పాటు వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. తమకు పూర్తి స్థాయి సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నామని తెలియజేస్తూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఎన్డీయే పార్టీల నేతలు లేఖలు అందజేశారు. వాటిని పరిశీలించిన తర్వాత మోదీని కొత్త ప్రధాని (పీఎం డిజిగ్నేట్)గా రాష్ట్రపతి నియమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రధానిగా మోదీ, కేంద్ర మంత్రులుగా ఇతర నేతల చేత ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు. 

18వ లోక్ సభ ఒక మైలురాయి 

2047 నాటికి వికసిత్ భారత్ సాకారం దిశగా 18వ లోక్ సభ ఒక మైలురాయిగా నిలుస్తుందని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతిని కలిసి వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘18వ లోక్ సభ కొత్త, యువ శక్తితో కొలువుదీరుతుంది. దేశ సేవ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి  మూడోసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. గత రెండు టర్మ్ లలో పని చేసినట్టే ఈ టర్మ్ లో కూడా కష్టపడి పని చేస్తాం’’ అని తెలిపారు.

అద్వానీ, జోషిని కలిసిన మోదీ

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ బీజేపీ సీనియర్లు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిని కలిశారు. ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనతో మోదీ భేటీ అయ్యారు. అనంతరం జోషి నివాసానికి కూడా వెళ్లి ఆయనను కలిసి మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కూడా మోదీ సమావేశమయ్యారు.   

దక్షిణాదిపై ప్రశంసలు

లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు తమను ఆదుకున్నాయని మోదీ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ, కర్నాటకలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయాయని, అందుకే ఆ రాష్ట్రాలతోపాటు ఒడిశాలోనూ తమకు మెజార్టీ వచ్చిందన్నారు. ఏపీ ప్రజల ఆదరణ మరిచిపోలేనిదని చెప్పారు. పవన్ కల్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదని.. ఆయన ఒక తుఫాన్ అని ప్రశంసించారు. టీడీపీ చీఫ్​చంద్రబాబు నాయుడు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తో దోస్తీ కలిసి వచ్చిందని మోదీ చెప్పారు. కేరళలోనూ ఓ ఎంపీని గెలుచుకున్నామని చెప్పారు.  

ఫేక్ న్యూస్​కు ఎరగా మారొద్దు 

కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవుల గురించి ప్రతిపక్ష ఇండియా కూటమి ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేయొచ్చని.. ఎన్డీయే ఎంపీలు ఆ ప్రచారానికి ఎరగా మారొద్దని ప్రధాని మోదీ హెచ్చరించారు. గత రెండు రోజులుగా టీవీల్లో వచ్చేదాంట్లో చాలా వరకూ నిజం లేదన్నారు. గత పదేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఇప్పుడు ఇలాంటి ఎక్సైట్ మెంట్ కనిపిస్తోందన్నారు. ‘‘ఎవరైనా మీ వద్దకు వచ్చి.. తమకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని, మంత్రిని చేస్తామని అనొచ్చు. కొందరు కొత్త మంత్రుల లిస్ట్ అని సంతకాలతో సహా జాబితాలను చూపొచ్చు. మరికొందరు ఏకంగా శాఖలతో సహా కొత్త మంత్రులతో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తారు కూడా. ఇలాంటివాటితో ఏమీ ఉపయోగం ఉండదని మీకు నేను స్పష్టం చేస్తున్నా” అని ఎన్డీయే ఎంపీలను మోదీ హెచ్చరించారు. ఇండియా కూటమి ఫేక్ న్యూస్ వ్యాప్తిలో డబుల్ పీహెచ్ డీ చేసిందని.. ఇలాంటి ట్రిక్కులకు ఎవరూ పడిపోవద్దన్నారు. 

జూన్ 4 తర్వాత మేం ప్రవర్తించిన తీరే విజయాన్ని మేం ఎలా తీసుకున్నామన్నది తెలియజేసింది. మేం విజయాలకు పొంగిపోం. ప్రతిపక్షాలు ఓడిపోయా యని ఎగతాళి కూడా చేయం. ఇదేమంత పెద్ద గెలుపేం కాదని చెప్పేందుకు, మా విజయాన్ని చిన్నగా చేసి చూపేందుకు ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. 
- నరేంద్ర మోదీ