రానున్న 25 ఏండ్లలో దేశాభివృద్ధిలో ఎన్నారైలది కీలక స్థానం:మోడీ

రానున్న 25 ఏండ్లలో దేశాభివృద్ధిలో ఎన్నారైలది కీలక స్థానం:మోడీ

ఇండోర్​: ప్రవాస భారతీయులే మన దేశానికి బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రానున్న 25 ఏండ్లలో దేశ అభివృద్ధిలో ఎన్నారైలది కీలక స్థానమని చెప్పారు. మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్​లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్​లో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రవాసీ భారతీయులను విదేశీ గడ్డపై భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్‌‌లుగా, మనదేశానికి దూతలుగా భావిస్తున్నాను. మన దేశం తరఫున విదేశాల్లో మీ పాత్ర ఎంతో భిన్నమైనది. యోగా, ఆయుర్వేదం, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు, కళలు, మిల్లెట్లకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు” అని ఎన్నారైలను ఉద్దేశించి మోడీ అన్నారు. మనదేశం అమృత్‌‌కాల్‌‌లోకి అడుగుపెట్టిందని, వచ్చే 25 ఏండ్ల ప్రయాణంలో ప్రవాసీ భారతీయులది కీలక స్థానమని చెప్పారు. ప్రపంచానికి మనం లీడర్​గా మారే ప్రక్రియ, మనదేశ గ్లోబల్ విజన్  ప్రవాసీల ద్వారా బలోపేతమవుతుందన్నారు. 

గ్లోబల్ లీడర్​గా మారే సత్తా మనకుంది.. 

జీ20 ప్రెసిడెన్సీతో ప్రపంచ వేదికపై మన దేశ స్వరం వినిపిస్తున్నామని మోడీ గుర్తుచేశారు. నాలెడ్జ్ సెంటర్​గా మాత్రమే కాకుండా నైపుణ్యాలకు కేంద్రంగా మారే సత్తా మన దేశానికి ఉందన్నారు. దేశంలో పెద్దసంఖ్యలో సమర్థులైన యువకులు ఉన్నారని, మన యువతలో నైపుణ్యంతో పాటు విలువలు, పని చేసే శక్తి ఉందని అన్నారు. వచ్చేరోజుల్లో ప్రపంచ అభివృద్ధికి మనదేశం ఇంజిన్​గా మారుతుందని చెప్పారు. సముద్రాలు దాటి గ్లోబల్ ట్రేడ్​ను పరిచయం చేసిన చరిత్ర మనదని మోడీ గుర్తుచేశారు. భిన్నమైన నాగరికతలున్న వివిధ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసి, ప్రపంచ శ్రేయస్సుకు మార్గం చూపించామని చెప్పారు. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే

మనం వేగంగా సాధిస్తున్న అభివృద్ధి, విజయాలపట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని మోడీ అన్నారు. ప్రపంచంలోనే టాప్ ప్లేస్​లో ఉన్న 5 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఇండియాను చేర్చామని, మూడో అతిపెద్ద స్టార్టప్​గా మనదేశం ఎదిగిందని చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం ఇండియాలోనే అవుతున్నాయని, అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఉన్న దేశాల్లో ఇండియా ఒకటని, ఒకేసారి 100 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు కొట్టామని ప్రధాని అన్నారు. ఎన్నారైల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, అన్నిరకాలుగా సాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.