ఆధునీకరణ పనులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు కొత్త రూపు

ఆధునీకరణ పనులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు కొత్త రూపు

తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేస్తారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు రూ.715 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. రూ.1,410 కోట్లతో పూర్తి  చేసిన సికింద్రాబాద్, మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు మోడీ. అంతేకాదు.. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను సైతం ప్రారంభిస్తారు. 

రాబోయే రోజుల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తరూపు రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉండే సకల సదుపాయాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనూ ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు. టికెట్‌ బుకింగ్‌ కేంద్రాలు, రైల్వే రక్షణ దళం కార్యాలయాలను తరలించేందుకు ప్రత్యామ్నాయ భవనాల నిర్మాణం సైతం చేపట్టారు. మోడీ శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులు స్పీడు అందుకోనున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఇవే సౌకర్యాలు..

* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఉత్తర, దక్షిణ వైపు ఉన్న భవనాలు ప్రస్తుతం 11,427 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉండగా.. అభివృద్ధి పనుల తర్వాత ఉత్తర, దక్షిణ వైపు జీ+ 3 అంతస్తులతో 37,308 చదరపు మీటర్ల మేర అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనాల విస్తీర్ణం 227 శాతం పెరుగుతుంది.

* ప్లాట్‌ఫామ్‌ల నిడివి కూడా పెరుగుతుంది. ఒక్కో ప్లాట్‌ఫామ్‌ మీద 2 రైళ్లు ఆగనున్నాయి. రైళ్లు ఎక్కేవారు, దిగేవారు వేర్వేరు మార్గాల్లో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. 

* మొదటి అంతస్తులో ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు వీలుగా 24,604  చదరపు మీటర్ల స్థలం అందుబాటులోకి వస్తుంది. 2వ అంతస్తులో రూఫ్‌టాప్‌ ప్లాజా వాణిజ్య సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్‌ఫామ్‌ల మీద రూఫ్‌ మొత్తం 42,212చ.మీ.ల మేర అందుబాటులోకి రానుంది.

* 7.5 మీటర్ల వెడల్పుతో రెండు పాదచారుల వంతెనలు, 26 లిఫ్టులు, 35 ఎస్కలేటర్లు నిర్మించనున్నారు. 1 నుంచి 10 ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు పాదచారుల వంతెన ఏర్పాటు కానుంది.

*  కరెంటు కోసం 5,000 కేడబ్ల్యూపీ సోలార్‌ పవర్‌ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. అగ్ని ప్రమాదాలకు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. 

* ఇప్పటికే పచ్చదనం, పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు. దివ్యాంగులు సులభంగా స్టేషన్‌లోకి చేరి రైళ్లు ఎక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

* విశాలమైన డబుల్‌ లెవెల్‌ రూఫ్‌ ప్లాజాతో పాటు దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

* సికింద్రాబాద్‌ ఈస్ట్‌కు, పాత గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్‌కు నేరుగా వాక్‌వేలు ఉంటాయి. రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకొనేలా వాక్‌వేలు నిర్మించనున్నారు. 

మొత్తంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణతో లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.