
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 24న రాత్రి ప్రకటించిన దేశ వ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారనే దానిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ వల్ల చాలా వరకు వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయగలిగినప్పటికీ ఢిల్లీ ఘటనతో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ ప్రభావం ఇంకా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లు, వారితో కాంటాక్ట్ అయిన వారికి సంబంధించిన కేసులు ఇంకా నమోదువుతూనే ఉన్నాయి. వీటిని పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చేందుకు లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండ్రోజుల క్రితం ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కోరారు. ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా చేశాయి. దీనికే ప్రధాని మోడీ కూడా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి లాక్ డౌన్ లాగా పూర్తిగా అన్ని కార్యకలాపాలను మూసేయడం కాకుండా కొంత మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం.
జాన్ బీ.. జహాన్ బీ..
ప్రధాని మోడీ గతంలో జాన్ హై తో జహాన్ హై అంటూ కామెంట్ చేశారు. కరోనా మహమ్మారి బారి నుంచి ముందుగా ప్రజల ప్రాణాలను కాపాడుకుంటే ఆ తర్వాత మిగతావి చూడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మొన్న సీఎంలతో జరిగిన సమావేశంలో జాన్ బీ, జహాన్ బీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుని బతుకు బండిని కూడా నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు విషయంలో మార్పులు చేస్తారని సమాచారం అందుతోంది. ప్రధాని పిలుపు మేరకు దాదాపు మూడు వారాల తర్వాత సోమవారం నాడు పలువురు కేంద్రమంత్రులు తమ ఆఫీసులకు వచ్చి సీనియర్ ఐఏఎస్ లతో సమీక్షలు నిర్వహిస్తూ తమ పనులు మొదలుపెట్టారు. ఇక దేశ వ్యాప్తంగా రైతుల వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా చేయడంతో పాటు వ్యవసాయానికి అనుబంధంగా నడిచే పరిశ్రమలకు కొంత సడలింపు కల్పించే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి పనుల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశాన్ని కరోనా కేసుల సంఖ్య ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన అక్కడి పరిస్థితులను బట్టి ఆంక్షల సడలింపు ఎలా ఉండాలన్న దానిపై మార్గదర్శకాలను ప్రధాని మోడీ మంగళవారం ఉదయం చేసే ప్రసంగంలో వివరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.